26, అక్టోబర్ 2012, శుక్రవారం

అద్వైత పంచరత్నమ్



.. అద్వైత పంచరత్నమ్ ..


నాహం దేహో నేన్ద్రియాణ్యన్తరంగో
      నాహంకారః ప్రాణవర్గో న బుద్ధిః |
దారాపత్యక్షేత్రవిత్తాదిదూరః
      సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోహమ్             || ||

రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జౌ యథాహిః
      స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః |
ఆప్తోక్త్యాహిభ్రాన్తినాశో స రజ్జు
      ర్జీవో నాహం దేశికోక్త్యా శివోహమ్              || ||

ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యమ్
      సత్యజ్ఞానానన్దరూపే విమోహాత్ |
నిద్రామోహాత్స్వప్నవత్తన్న సత్యమ్
      శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోహమ్             || ||

నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో
      దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః |
కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం
      కారస్యైవ హ్యాత్మనో మే శివోహమ్             || || 

మత్తో నాన్యత్కించిదత్రాస్తి విశ్వం
      సత్యం బాహ్యం వస్తు మాయోపక్లృప్తమ్ |
ఆదర్శాన్తర్భాసమానస్య తుల్యం
      మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోహమ్         || ||

 || ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అద్వైత పంచరత్నం సమ్పూర్ణమ్ ||

24, అక్టోబర్ 2012, బుధవారం

ఈశావాస్యోపనిషత్ - శంకర భాష్యం



ఓం గణేశాయ నమః

 


|| ఈశావాస్యోపనిషత్ ||

శ్రీమచ్ఛంకర భగవత్పాద విరచిత భాష్య సమేతా

 

 

 

 

 

 

తెలుగు అనువాదము

యల్లాప్రగడ వేంకట మల్లేశ్వరరావు

 

 

 

 

 

 

 

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

ఓం శాంతిః శాంతిః శాంతిః |

 

శంకర భాష్యమ్

ఈశా వాస్యమ్’ ఇత్యాదయో మన్త్రాః కర్మస్వవినియుక్తాః, తేషామకర్మశేషస్యాత్మనో యాథాత్మ్యప్రకాశకత్వాత్ | యాథాత్మ్యం చాత్మనః శుద్ధత్వాపాపవిద్ధత్వైకత్వ నిత్యత్వాశరీరత్వ సర్వగతత్వాది వక్ష్యమాణమ్ (వక్ష్యమాపణమ్) | తచ్చ కర్మణా విరుధ్యేతేతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః      | నహ్యేవంలక్షణమాత్మనో యాథాత్మ్యమ్ ఉత్పాద్యం వికార్యమ్ ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా, యేన కర్మశేషతాస్యాత్ | సర్వాసాముపనిషదామాత్మయాథాత్మ్య నిరూపణేనైవోపక్షయాత్ | గీతానాం మోక్షధర్మాణాం చైవం పరత్వాత్ | తస్మాదాత్మనోఽనేకత్వకర్తృత్వభోక్తృత్వాది చ అశుద్ధత్వపాపవిద్ధత్వాది చోపాదాయ లోకబుద్ధిసిద్ధం కర్మాణి విహితాని | యో హి కర్మఫలేనార్థీ దృష్టేన బ్రహ్మవర్చసాదినా అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతిరహం న కాణత్వకుణిత్వాద్యనధికారప్రయోజక (కాణకుబ్జత్వా...) ధర్మవానిత్యాత్మానం మన్యతే సోఽధిక్రియతే కర్మస్వితి హ్యధికారవిదో వదన్తి | తస్మాదేతే మన్త్రాః ఆత్మనో యాథాత్మ్యప్రకాశనేన ఆత్మవిషయం స్వాభావికకర్మవిజ్ఞానం (స్వాభావికమజ్ఞానం) నివర్తయన్తః, శోకమోహాదిసంసారధర్మవిచ్ఛిత్తిసాధనమాత్మైకత్వాది విజ్ఞాన ముత్పాదయన్తీతి (.....ముత్పాదయన్తి) | (ఇతి) ఏవముక్తాధికార్యభిధేయ (ఇత్యేవ....) సంబన్ధ ప్రయోజనాన్మన్త్రాన్సఙ్క్షేపతో వ్యాఖ్యాస్యామః -----

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          ‘ఈశా వాస్యమ్ మొదలుగా గల మంత్రాలు కర్మలలో వినియోగములు కావు. (ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేద సంహితా మంత్రములలో ఒక భాగము. సాధారణంగా ఉపనిషత్తులు అరణ్యకాలలో భాగమై ఉంటాయి.  ఈశావాస్యోపనిషత్ యొక్క విశిష్టత ఏమంటే, ఇది సంహితయొక్క మంత్రభాగంలో చేర్చబడింది.  అందుచేతనే దీనిని మంత్రోపనిషత్ లేదా సంహితోపనిషత్ అని కూడా అంటుంటారు.  ఈ ఉపనిషత్ ప్రారంభం కావడానికి పూర్వం సంహితలో అనేక మంత్రాలు యజ్ఞయాగాది కర్మలలో ఉపయోగించు కోవడం కోసం చెప్పబడినాయి.  అలాగే ఈ ఈశావాస్యోపనిషత్ లోని మంత్రాలు కూడా ఏదైన కర్మ చేయడం కోసం ఉపయోగించే మంత్రాలేమో అని పొరబడే అవకాశం ఉన్నందున, శంకరులు ఈ మంత్రాలు యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు మొదలైన కర్మలలో అనుష్టించబడే మంత్రాలు కావని ముందుగానే హెచ్చరిస్తున్నారు.) ఇవి అకర్మశేషమైన (కర్మ స్వభావమేమీ లేకుండా మిగిలినదీ, కర్మకు అనుబంధము కానిదీ అయిన) ఆత్మ యొక్క యధార్థతత్త్వాన్ని (ఎలా ఉన్నదో అలా లేదా యథాతథంగా లేదా ఉన్నది ఉన్నట్లుగా) ప్రకాశింపచేస్తాయి (వివరిస్తాయి). శుద్ధమైన (రాగ ద్వేషాలచే కలుషితం కాని), పాపసంబంధమేలేని (పాప పుణ్యాలచే ప్రభావితంకాని), ఏకమైన (సర్వత్రా ఒకటియే అయిన), నిత్యమైన (సర్వకాలాలలోనూ ప్రకటితమైన), రూపంలేని (నిర్దిష్టమైన ఆకారమేమీ లేని), అంతటా నిండియున్నటువంటి లక్షణాలు కల ఆత్మయొక్క నిజతత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి. (ఈ చెప్పిన లక్షణాలేవీ కర్మకు సంబంధించినవి కావు.  వీటి గురించి రాబోయే 8వ మంత్రంలో మరింత వివరంగా చెప్పబోతున్నారు).  కర్మలకు విరుద్ధమైన విషయాన్ని బోధిస్తున్నందువలన, ఈ మంత్రాలకి కర్మలలో వినియోగం లేదనడం (కర్మకు సంబంధించినవి కాదు అనడం) యుక్తమే. ఎందువల్లనంటే, పైన చెప్పిన లక్షణాలు గల ఆత్మ ఉత్పత్తి (తయారు) చేయబడేది కాదు, మార్పుచెందేది కాదు, సంపాద్యమైనది కాదు (పొందబడేది కాదు), సంస్కరింపబడేది కాదు (బాగుచేయబడేది కాదు). కర్మలలో వ్వవహరించే కర్త (వ్యవహరించేది) లేదా భోక్త (కర్మఫలాన్ని అనుభవించేది) కూడా కాదు. (సాధారణంగా యజ్ఞంలో భాగమైన లేదా అనుబంధమైన కర్మ నాలుగు రకాలుగా ఉంటుంది. తయారుచేయడం, మార్పు చేయడం, సంపాదించడం, సంస్కరించడం. వీటికి ఉదాహరణలు వరుసగా,  వరి పిండితో హోమంలో వేసేందుకు పలకలు తయారుచేయడం, సోమలతలను పిండి సోమరసంగా మార్పుచేయడం, యజ్ఞంలో మంత్రాలను అనుష్టించేదుకై తగిన ఋత్విక్కులను సంపాదించడం, ధాన్యాన్ని పొట్టుతీసి హోమంలో వినియోగించేందుకు పవిత్రీకరించడం.  ఈ విధమైన కర్మలేవీ ఈ మంత్రాలలో చెప్పనందున, ఈ మంత్రాలలో వివరించబడే ఆత్మకు కర్మలలో ఎటువంటి పాత్ర లేదు.)  అందుచేత, అది (మంత్రాలలో వివరింపబడిన ఆత్మ) కర్మకు అనుబంధమైనది కాదు (కర్మశేషము కాదు). ఉపనిషత్తులన్నీ ఆత్మ యథార్థతత్త్వాన్ని నిరూపించి విరమిస్తున్నాయి. (ఇంతకు మించి ఇక చెప్పేందుకు ఏమీ లేదని ఊరుకొంటున్నాయి.)  భగవద్గీత, (మహాభారతములోని శాంతిపర్వంలో చెప్పబడిన) మోక్షధర్మాల ప్రయోజనం కూడా అదే. అటువంటి ఆత్మకు, ఉపాధుల లక్షణాలైన అనేకత్వం, కర్తృత్త్వం, భోక్తృత్త్వం, అశుద్ధత్వం, పాపసంబంధాలను ఆరోపించి, (ఆ ఉపాధులనే ఆత్మగా) వ్యవహరించే సామాన్య బుద్ధికల ప్రజలకు మాత్రమే కర్మలు విధింపబడినవి. (మరి వేదంలో ఎక్కువ భాగం కర్మల గురించే ప్రస్తావించబడింది కదా. ఆ కర్మకాండ అంతా ఎవరిని ఉద్దేశించి చెప్పబడిందనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు.  సామాన్య జనులకు ఆత్మ మరియు దాని తత్త్వం తేలికగా అర్థమయ్యేది కాదు.  దానికి కొంత కృషి, పరిశ్రమ అవసరం.  అందుచేత, అటువంటి సామాన్య జనులు, అనగా ఆత్మ తత్వాన్ని తెలుసుకొనలేని వారు, తేలికగా అనుష్టించగలిగిన కర్మలను వేదంలో ఎక్కువభాగం చెప్పడం జరిగింది.) ఎందుకంటే,  కర్మాచరణార్హతల గురించి తెలిసినవారేమంటారంటే, కర్మఫలాలను - అనగా దృశ్యమానమైన బ్రహ్మవర్చస్సూ మొదలైనవాటినీ, అదృశ్యమానమైన స్వర్గాది ఫలాలనూ - కోరే వారికీ మరియు నేను ద్విజుడను, కాణత్వము (దృష్టి లోపము), కుబ్జత్వము (గూనితనము) లేదా కుణిత్వము (పసిదనము లేదా బలహీనత్వము) మరియు ఏ ఇతర లోపములు (కర్మను ఆచరించేందుకు వీలులేని శారీరక, మానసిక లోపములు) లేని వాడను, అని భావించేవారికే కర్మ విధింపబడిందని చెప్తారు. (సాధారణంగా ఏవైనా కోరికలను సాధించుకోవాలి అని అనుకొనే వాళ్ళకి, ఫలానా కర్మ చేస్తే ఫలానా ఫలం పొందవచ్చనే ఉద్దేశం ఉన్నవాళ్ళకీ, అలాగే కర్మ చేయడానికి నాకేమీ అవయవలోపం లేదు, బలహీనుణ్ణి కాదు అనుకొనేవాళ్లకే కర్మ చేసే అర్హతుందని అంటారు.  కాని ఇక్కడ ఈ మంత్రాలలో కర్మల గురించిగానీ, కర్మలను ఆచరించేందుకు కావలసిన అర్హతల గురించిగానీ ప్రస్తావనే లేదు. ఒకవేళ, అట్టి అర్హతల ప్రస్తావన లేకపోయినా, కర్మలు గాని వాటి వల్ల కొత్తగా పొందబడే ఫలం గురించి గాని కూడా ప్రస్తావన లేదు.)  కాబట్టి, ఈ మంత్రములు, ఆత్మ యొక్క యథార్థ తత్త్వాన్ని స్పష్టంగా వివరించడం ద్వారా, స్వాభావికమైన అజ్ఞానాన్ని నివర్తించి, సంసార ధర్మాలైన శోకం, మోహం వంటివాటిని నిర్మూలించే సాధనమైన ఆత్మ, ఏకమైనదనే జ్ఞానాన్ని ఉద్భవింపజేస్తాయి. ఈవిధంగా, అధ్యయనానికి కావలసిన యోగ్యతలనూ, మంత్ర విషయజ్ఞానాన్నీ (ఆత్మ యాథాత్మ్యమే అభిధేయం అంటే ఆత్మయొక్క యదార్థతత్త్వమే ఇక్కడ తెలుసుకొనబడే విషయం), వాటి మధ్య సంబంధాన్నీ, ప్రయోజనాన్నీ వివరించిన మీదట, ఈ మంత్రాల సంక్షిప్తమైన వివరణ ఇక చెప్పబడుతోంది.

                ఓం ఈశావాస్యమిదగ్o సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ |

                తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్య స్విద్ధనమ్ ||       .. 1 ..

      కదిలే జగత్తునందలి సర్వమునూ ఈశ్వరునిచే కప్పివేయాలి. కాబట్టి, త్యాగముతో రక్షించుకో.  ఎటువంటి సంపదనూ కోరకు. 

 

శంకర భాష్యమ్

 ఈశా | ఈష్టే ఇతి ఈట్, తేన ఈశా | ఈశితా పరమేశ్వరః పరమాత్మా సర్వస్య | సః హి సర్వమీష్టే సర్వజన్తూనామాత్మా సన్ ప్రత్యగాత్మతయా | తేన స్వేన రూపేణాత్మనా ఈశా వాస్యమ్ ఆచ్ఛాదనీయమ్ | కిమ్? ఇదం సర్వం యత్కిఞ్చ యత్కిఞ్చిజ్జగత్యాం పృథివ్యాం జగత్ తత్సర్వమ్ | స్వేనాత్మనా  ప్రత్యగాత్మతయా అహమేవేదం సర్వమితి పరమార్థసత్యరూపేణానృతమిదం సర్వం చరాచరమాచ్ఛాదనీయం (స్వేన) పరమాత్మనా | యథా చన్దనాగర్వాదేరుదకాది సంబన్ధజక్లేదాదిజమౌపాధికం దౌర్గన్ధ్యం తత్స్వరూపనిఘర్షణేనాచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గన్ధేన, తద్వదేవ హి స్వాత్మన్యధ్యస్తం స్వాభావికం కర్తృత్వభోక్తృత్వాదిలక్షణం జగద్ద్వైతరూపం (జగత్యాం) పృథివ్యామ్, జగత్యామిత్యుపలక్షణార్థత్వాత్సర్వమేవ నామరూపకర్మాఖ్యం వికారజాతం పరమార్థసత్యాత్మభావనయా త్యక్తం స్యాత్ | ఏవమీశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్యేషణాత్రయసంన్యాసే (…సంన్యాస) ఏవాధికారః (ఏవాధికారో), న కర్మసు | తేన త్యక్తేన త్యాగేనేత్యర్థః | న హి త్యక్తో మృతః పుత్రో (వా) భృత్యో వా ఆత్మసంబన్ధితాభావాదాత్మానం (…సంబన్ధితాయా అభావా…) పాలయతి | అతస్త్యాగేనేత్యయమేవార్థః (అతస్త్యాగేన ఇత్యయమేవ వేదార్థః) | భుఞ్జీథాః పాలయేథాః | ఏవం త్యక్తైషణస్త్వం మా గృధః గృధిమ్ ఆకాఙక్షా మా కార్షీః ధనవిషయామ్ | కస్య స్విత్ (కస్యస్విద్ధనం) కస్యచిత్ పరస్య స్వస్య వా ధనం మాకాఙక్షీరిత్యర్థః | స్విదిత్యనర్థకో నిపాతః | అథవా, మా గృధః | కస్మాత్? కస్య స్విద్ధనమ్ ఇత్యాక్షేపార్థః (ఇత్యాక్షేపార్థో) | న కస్య చిద్ధనమస్తి, యద్గృధ్యేత | ఆత్మైవేదగ్o  సర్వమ్ (ఛాం.ఉ. 7-25.1) ఇతి ఈశ్వరభావనయా సర్వం త్యక్తమ్ | అతః ఆత్మనః ఏవేదం సర్వమ్, ఆత్మైవ చ సర్వమ్ | అతో మిథ్యావిషయాం గృధిం మా కార్షీరిత్యర్థః ||

ఏవమాత్మవిదః పుత్రాద్యేషణాత్రయసంన్యాసేనాత్మజ్ఞాననిష్ఠతయా ఆత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః | అథేతరస్య అనాత్మజ్ఞతయాత్మగ్రహణా- శక్తస్య ఇదముపదిశతి మన్త్రః ----

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

శాసించు అనే అర్థాన్నిచ్చే ఈట్ శబ్దానికి తృతీయావిభక్తి ఏకవచన రూపము ఈశా.  శాసించే ఆతడే ఈశా’,  ఈశితాఅంటే పరమేశ్వరుడు, అన్నింటానున్న సర్వోత్కృష్టమైన ఆత్మ. ఎందువల్లనంటే, అతడే సర్వ జంతు జాలంలోని అంతరతమమైన ఆత్మగా అనగా ప్రత్యగాత్మరూపంగా ఉంటూ సర్వాన్నీ  శాసిస్తున్నందువలన. ఈశా– ఆ ఈశ్వరునిచేత, అతని స్వరూపమైన పరమ ఆత్మచే వాస్యమ్– కప్పివేయబడవలెను.  దేనిని కప్పివేయాలి? జగత్యామ్’ – జగత్తునందు; జగత్– కదలుతున్న; ఇదమ్ సర్వమ్ యత్ కిమ్ చ’ - ఏదైతో ఉన్నదో ఆ సర్వస్వమూ. ఈ సర్వ చరాచర జగత్తునీ నేనే ఈ సర్వమనే జ్ఞానంతో పరమార్థ సత్యరూపమైన ప్రత్యగాత్మగా పరమాత్మ ఆవరించాలి.  ఏ విధంగానైతే చందనం, అగరూ మొదలైన వాటిని (సుగంధ ద్రవ్యాలను) రాపిడిచేయడం వలన, అవి జల సంబంధంగా జనించే సహజ దుర్గంధాన్ని పోగొట్టి వాటి వాటి సుగంధాలతో ఆవరిస్తాయో, ఆవిధంగానే ఆత్మపై ఆరోపించబడిన స్వాభావిక కర్తృత్త్వ భోక్తృత్వాది లక్షణాలూ; జడంగానూ చేతనంగానూ ద్వందంగా కనబడే జగత్తుయొక్క ఉపలక్షణములూ (జగత్తు యొక్క లక్షణాలను పోలియున్న ఇతరములన్నీ అనగా దేవలోకము, పితృలోకము మొదలైనవన్నీ); నామ, రూప, కర్మల వికార జన్యమైన ఈ సర్వస్వమూ;  ఆత్మ పరమార్థసత్యమనే భావనారాపిడివల్ల త్యజింపబడుతాయి. ( ఆత్మ ఒక్కటే పరమ సత్యము. మిగిలిన ఈ జగత్తు అంతా ఆత్మపై  కల్పించబడినది మాత్రమే అనే భావనను పదేపదే గుర్తుచేసుకోవాలి.  ఈ భావన అనే సుగంధంతో రాపిడి చేయగా చేయగా అసత్యమైన ఈ జగత్తు అనే మురికి వదిలిపోతుంది.  అంటే త్యజిస్తుంది.  త్యాగం చేయబడుతుంది.  ఆత్మయే సత్యమనే భావనారాపిడి వల్ల జగత్తు త్యాగం చేయబడుతుంది.  ఈ జగత్తు కల్పన మాత్రమే.  అది నిజంకాదు అన్న నిజం అవగతమౌతుంది.)  ఈ త్యాగభావనతో, ఆత్మను పరమాత్మగా ధ్యానించే వానికి, ఈషణాత్రయమును (పుత్రైషణ, లోకైషణ, విత్తైషణములను ఈషణాత్రయములంటారు.  ఏ కోరిక అయినా ఈ మూడింటిలో ఏదో ఒక దాని కిందికి వస్తుంది.  సంతానం గురించి, లోకం గురించి, ధనం గురించిన విషయాలను) సన్యసించేందుకు (వదలివేసేందుకు)  మాత్రమే అధికారము కాని, కర్మాచరణకు అధికారము లేదు. (ఈ విధంగా ఆత్మ భావనతో విశ్వాన్ని కప్పివేసిన వానికి సర్వమూ ఆత్మగానే అనుభవంలోకి వస్తుంది, ఆత్మకు భిన్నమైనదేదీ ఉండదు.  కాబట్టి, వానికి ఆత్మకు భిన్నమైనదిగా కనిపించే ఈ జగత్తు అంతా కల్పనేనని అవగతమై, సంతానం, లోకం, ధనం గురించిన కోరికలన్నింటినీ త్యాగం చేసేందుకు అర్హుడౌతాడు.  కోరికలన్నింటినీ త్యాగం చేసిన వాడిక కర్మ ఏమీ చేయడు.  అంటే, వానికి కర్మ చేసే అధికారం ఉండదు.) తేన త్యక్తేన’ – ఆవిధంగా త్యజించిన వానికి (త్యజించడం అంటే, వదలివేయడం.  ఎందుకు వదలి వేస్తున్నాడంటే, అవి ఆత్మపైన ఆరోపింపబడిన విషయములైనందున.  కల్పించబడినవైనందున అవి సత్యములు కావు.  అసత్యమైన వాటిని త్యజించడం సహజమైన విషయమే) అందుచేత, ఈ వదలివేయడం త్యాగభావనతోనేనని అర్థం.  మృతుడైన పుత్రునినీ లేదా సేవకునినీ వదలివేయడం వంటిది కాదు. (పుత్రుని గురించిన చింత అతడు మరణించిన తరువాత కూడా ఉంటుంది. గతంలో పుత్రుడున్నాడు.  అతనితో తనకు గల అనుబంధం మరణించిన తర్వాత కూడా గుర్తుకొస్తూనే ఉంటుంది.  ఆ భావన పూర్తిగా తొలగిపోదు.  ఇక్కడ విషయం అలాంటిది కాదు.  అప్పటి దాకా సత్యమని అనుకొన్నవి అసత్యాలని నిర్ణయం జరిగాక వాటిపై అనుబంధం కాని రాగద్వేషాలు కాని ఇకపై ఉండే అవకాశమే లేదు.)   వీటికి ఆత్మతో సంబంధం లేదనే (త్యాగ) భావనను పాటించాలి.  త్యాగభావనతో అంటే ఇదే అర్థం. భుఞ్జీథాః’ – పాలింపబడుట, రక్షింపబడుట. (ఈషణాత్రయాన్ని సంన్యసించిన వాని రక్షణ, పాలన ఈశ్వరుడే వహిస్తాడని భావం.)  అలా ఈషణాలను త్యజించినటువంటి నీవు మా గృధః’ – కాంక్షింపకు, మిథ్యయైన సంపద గురించి ఎటువంటి కోరిక వద్దు. కస్య స్విద్– ఎవనిదైనా, ధనము స్వంతమైనా, పరులదైనా; ‘స్విత్ అనేది ప్రత్యేకార్థం లేని (అనగా ప్రకృతి, ప్రత్యయ విభాగము లేనిది – నిపాత) పదం.  లేదా ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు.  కాంక్షించకు.  ఎందుకు?  కస్యస్విద్ ధనమ్?’ -  ఎవరిది ధనం?  ఇది ఆక్షేపణ పరమైన (వ్యతిరేక) అర్థం. ఆకాంక్షించేందుకు ధనం ఇతరులది ఎవరిదీ లేదు. ఇది సర్వమూ ఆత్మే, ఈశ్వరుడేననే భావనతో సర్వాన్నీ త్యజించాలి.  సర్వమూ ఆత్మే.  ఆత్మే సర్వస్వమూ. (ఆత్మయే సత్యము. ఆత్మ కాకుండా మిగిలినదేదీ లేదు. అంటే ఉన్నట్టు కనబడేదంతా అసత్యమే. దాని అసలు స్వరూపం ఆత్మయే.) అసత్యమైన విషయాలను కాంక్షించవద్దు.

          ఈ విధంగా, ఆత్మవిషయాన్ని తెలుసుకొన్నవారు, ఈషణాత్రయాన్ని సంన్యసించి ఆత్మజ్ఞాన నిష్ఠతో ఆత్మ భావనను రక్షించుకోవాలని, ఈ వేద పాఠానికి (పై మంత్రానికి) అర్థం.  అనాత్మవిషయజ్ఞాన పరులై  (అనాత్మ వస్తువులు అంటే మిథ్యావస్తువుల గురించిన జ్ఞానము మాత్రమే కలవారై) ఆత్మను గుర్తింపలేని వారికై తరువాతి ఉపదేశము ఇవ్వబడుతోంది.

             

            కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్o సమాః |

ఏవం త్వయి నాన్యథేతోఽస్తి న కర్మ లిప్యతే నరే ||  .. 2 ..

         

          కర్మలను నిర్వర్తిస్తూ వంద సంవత్సరాలకాలం జీవించాలనుకుంటే నరుడా నీకు వేరే విధానం లేదు.  కర్మ అంటదు.

 

శంకర భాష్యమ్

కుర్వన్నేవ నిర్వర్తయన్నేవ ఇహ కర్మాణి అగ్నిహోత్రాదీని జిజీవిషేత్ జీవితుమిచ్ఛేత్ శతం శతసంఖ్యాకాః సమాః సంవత్సరాన్ | తావద్ధి పురుషస్య పరమాయుర్నిరూపితమ్ | తథా చ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేచ్ఛతం వర్షాణి తత్కుర్వన్నేవ కర్మాణీత్యేతద్విధీయతే | ఏవమ్ ఏవంప్రకారేణ త్వయి జిజీవిషతి నరే నరమాత్రాభిమానిని ఇతః ఏతస్మాదగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమానాత్ప్రకారాత్ అన్యథా ప్రకారాన్తరం నాస్తి, యేన ప్రకారేణాశుభం కర్మ న లిప్యతే, కర్మణా న లిప్యతి ఇత్యర్థః | అతః శాస్త్రవిహితాని కర్మాణ్యగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషేత్||

కథం పునరిదమవగమ్యతే-----పూర్వేణ మన్త్రేణ సన్న్యాసినో జ్ఞాననిష్ఠోక్తా, ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠోక్తా ఇతి? ఉచ్యతే---జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవదకమ్ప్యం యథోక్తం న స్మరసి కిమ్? ఇహాప్యుక్తమ్----- యో హి జిజీవిషేత్స కర్మాణి కుర్వన్నేవ ఇతి, ఈశా వాస్యమిదం సర్వమ్’, తేన త్యక్తేన భుఞ్జీథాః మా గృధః కస్య స్విద్ధనమ్’ ఇతి చ | న జీవితే మరణే వా గృధిం కుర్వీతారణ్యమియాత్ ఇతి పదం తతో న పునరియాత్’ ఇతి చ సంన్యాసశాసనాత్ | ఉభయోః ఫలభేదం చ వక్ష్యతి | ఇమౌ ద్వావేవ పన్థానౌ అనునిష్క్రాన్తతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్సన్న్యాసశ్చ’, (......ఉత్తరేణ  నివృత్తిమార్గేణ ఏషణాత్రయస్య త్యాగః ) తయోః సన్న్యాస (పథ) ఏవాతిరేచయతి---- న్యాస ఏవాత్యరేచయత్’ ఇతి తైత్తిరీయకే (మహానారాయణోపనిషత్ 21-2) | ‘ద్వావిమావథ పన్థానౌ యత్ర వేదాః­ ప్రతిష్ఠితాః | ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తౌ చ సుభాషితః’ (మహాభారతమ్, శాంతిపర్వమ్ 241-6) ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితముక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవతా | విభాగం చానయోః దర్శయిష్యామః ||

అథేదానీమవిద్వన్నిన్దార్థేఽయం మన్త్రః ఆరభ్యతే---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

కర్మాణి’ - అగ్నిహోత్రము మొదలైన కర్మలను; కుర్వన్ ఏవ ఇహ– ఇక్కడ నిర్వర్తించుటచేత మాత్రమే; నిర్వహించుట చేతనే; శతం సమాః వంద సంవత్సరములు; అది (వంద సంవత్సరాలు) పురుషుని పరమ ఆయుఃప్రమాణము; జిజీవిషేత్ జీవించాలి అనుకొంటే; ఆవిధంగా మరింత వివరంగా చెప్పాలంటే, శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూ (కర్మలను ఆచరించడమే ఇక్కడ విధి.  ఆ విధంగా కర్మలను ఆచరించడమే విధిగా పెట్టుకొని) వంద సంవత్సరాలు జీవించాలి. ఏవమ్ త్వయి- ఈప్రకారంగా, నీవు జీవించాలనుకొంటే, నరే - తనని దేహంగా గుర్తించే నరుడా; అన్యథా – ఇతర విధానం; ఇతః – ఈ విధానం కాక మరొకటి, ప్రస్తుత జీవన విధానమైన అగ్నిహోత్రాది కర్మలను చేస్తూ జీవించడం కాకుండా మరొక విధానం; న అస్తి – లేదు. ఇక్కడ అగ్నిహోత్రాది కర్మలను (వేదము నిర్ణయించిన రీతిలో) విధానంగా ఆచరిస్తూ గడపాలి. ఇతర విధానములు లేవు.  ఈ విధానంలో, ‘కర్మ న లిప్యతే -  అశుభ కర్మ (పాప కర్మ) అంటుకోదు.  కర్మ బంధమేర్పడదని అర్థం.  అలా శాస్త్రము విధించిన అగ్నిహోత్రాది కర్మలను మాత్రమే నిర్వహిస్తూ జీవించాలి. (వేదం చెప్పిన విధానంలో అగ్నిహోత్రాది కర్మలను చేస్తూ నిండు నూరేళ్ళు జీవించాలనుకున్న నరునికి వేరే మార్గం లేదు.  అలా చేస్తే అశుభ కర్మ అంటుకోదు.  వేదం విధించిన కర్మలు శుభ కర్మలు.  వేదం నిషేధించిన కర్మలు అశుభ కర్మలు.  వేదం విధించిన కర్మలతో జీవితాన్ని గడపాలనుకొనేవాడు, వేదం నిషేధించిన కర్మల జోలికి వెళ్ళడు. కర్మల పట్ల అభిమానమున్నవాడైనప్పటికీ, అశుభ కర్మలను నిర్వహించడని అర్థం.  అటువంటి వానికి ఇక వేరే విధానమే లేదు.)

సందేహం: పూర్వం చెప్పిన మంత్రం (1వ మంత్రము) సంన్యాసులనూ జ్ఞాననిష్ఠ కలిగిన వారినీ ఉద్దేశించినదనీ, తరువాతి మంత్రము (2వ మంత్రము) అశక్తులైన కర్మనిష్ఠులను ఉద్దేశించినదనీ తెలియడమెలా?  

సమాధానం: పరిచయ భాష్యంలో, జ్ఞాన కర్మల మధ్య తేడా పర్వతంలా అధిగమించలేనిదని చెప్పిన విషయం గుర్తు లేదాఇక్కడ కూడా అదే చెప్పబడుతోంది – జీవించాలనుకొన్నవాడు కర్మలను ఆచరించాలి అని కర్మనిష్ఠులకూ, ‘ఇదంతా ఈశ్వరునిచే కప్పివేయవలెను’,  త్యాగముతో నిన్ను నీవు కాపాడుకో’, ‘ఎటువంటి సంపదనీ ఆకాంక్షింపకుఅనీ మరియు జీవన్మరణాలపై కోరిక లేకుండా అరణ్య గమనం, అక్కడినుండి తిరిగి రాకుండుటఅని సంన్యాసులకూ వేదం విధించింది.  ఈ రెండింటికీ ఫలభేదం ముందుముందు చెప్పబడబోతోంది (7 మరియు 18 వ మంత్రాలలో).  సృష్టి ప్రారంభంలో ఈ రెండు మార్గాలూ ఏర్పడ్డాయి – మొదట కర్మాచరణ (ప్రవృత్తి) మార్గము, తదుపరి నివృత్తిలో ఈషణాత్రయాలను త్యజించే సంన్యాస మార్గము  [ఇమౌ ద్వావేవ పన్థానౌ అనునిష్క్రాన్తతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్సన్న్యాసశ్చ’]. వానిలో సంన్యాసమే (మార్గమే) ఉత్తమము. సంన్యాసమే అత్యుత్తమం[‘న్యాస ఏవాత్యరేచయత్’ తైత్తిరీయకే (మహానారాయణోపనిషత్ 21-2)] అని తైత్తిరీయము బోధిస్తోంది. వేదాచార్యుడైన వ్యాసుడు, సమగ్రంగా విచారించి నిశ్చయంతో, తన కుమారుడైన శుకునితోఈ రెండు మార్గాలలోనే వేదాలు ప్రతిపాదింపబడినవి. కర్మాచరణకు సంబంధించిన ప్రవృత్తి మార్గము మరియు త్యాగపరమైన నివృత్తి మార్గము అని చెప్పాడు (మహాభారతం శాంతి పర్వము 1.1.2 – 41.6) [‘ద్వావిమావథ పన్థానౌ యత్ర వేదాః­ ప్రతిష్ఠితాః | ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తౌ చ సుభాషితః’ (మహాభారతమ్, శాంతిపర్వమ్ 241-6)].  వీటి మధ్యనున్న మరిన్ని బేధాలు ముందు ముందు చూపబడుతాయి.

          ఇక అజ్ఞానపరుని హెచ్చరిస్తూ తదుపరి మంత్రం ప్రారంభమవుతుంది ---

            అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసాఽవృతాః |

తాగ్o స్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చాత్మహనో జనాః ||      .. 3 ..

 

శంకర భాష్యమ్

అసుర్యాః పరమాత్మభావమద్వయమపేక్ష్య దేవాదయోఽప్యసురాఃతేషాం చ స్వభూతా లోకా అసుర్యాః నామ  |  నామశబ్దోఽనర్థకో నిపాతః  |  తే లోకాః కర్మఫలాని లోక్యన్తే దృశ్యన్తే భుజ్యన్త ఇతి జన్మాని  |  అన్ధేన అదర్శనాత్మకేనాజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః  |  తాన్ స్థావరాన్తాన్, ప్రేత్య త్యక్త్వేమం దేహమ్ అభిగచ్ఛన్తి యథాకర్మ యథాశ్రుతమ్  |  యే కే చ ఆత్మహనః ఆత్మానం ఘ్నన్తీత్యాత్మహనః  |  కేతే జనాః యేఽవిద్వాంసః  |  కథం తే ఆత్మానం నిత్యం హింసన్తిఅవిద్యాదోషేణ విద్యమానస్యాత్మనస్తిరస్కరణాత్  |  విద్యమానస్యాత్మనో యత్కార్యం ఫలమజరామరత్వాదిసంవేదనాదిలక్షణమ్, తత్ హతస్యేవ తిరోభూతం భవతీతి ప్రాకృతా అవిద్వాంసో జనా ఆత్మహన ఇత్యుచ్యన్తే  |  తేన హ్యాత్మహననదోషేణ సంసరన్తి తే  ||

యస్యాత్మనో హననాదవిద్వాంసః సంసరన్తి, తద్విపర్యయేణ విద్వాంసో ముచ్యన్తేఽనాత్మహనః, తత్కీదృశమాత్మతత్త్వమిత్యుచ్యతే---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

అసుర్యాః- భూతముల యొక్క; అద్వయమైన పరమాత్మభావనా నేపథ్యంలో దేవాదులు కూడా అసురులే, భూతములే. (పరమాత్మ తప్ప వేరొకటి లేదన్న భావనా దృష్టిలో దేవతలు కూడా అసురులే)  వారి అనుభవములోని లోకములే అసుర్యాః. నామ శబ్దము అర్థములేని నిపాత. తే – ఆ; లోకాః –లోకములు {లుక్ ధాతువు నుండి పుట్టినది} అంటే కర్మఫలాలు దృశ్యరూపంగా అనుభవించబడుతూ, భోగింపబడుతున్న జన్మలు అని అర్థం; ‘అన్ధేన – కానరాని, కంటిచేత చూడశక్యము కాని; ‘తమసా – చీకటిచే, అజ్ఞానరూపమైన దానిచే; ‘ఆవృతాః – ఆవరించబడినవి. అజ్ఞానాంధకారపు చీకట్లు ఆవరించి కప్పివుంటవి.  ‘తాన్ – వారికి, స్థావర పర్యంతమూ (స్థిరంగా కదలకుండా ఉండే వృక్షాల వంటి వాటితో సహా సర్వ జీవజాలమంతా కూడా); ‘ప్రేత్య – వీడిన తర్వాత, ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత; ‘గచ్ఛన్తి – వెళుతారు, వాని వాని కర్మానుసారంగా ఉపాసనానుసారంగా; ‘ఆత్మహనః ఆత్మభావనను చంపుకున్న వారు. ఎవరు వారు? జనాః(సాధారణ జనులు) అజ్ఞానులు. వారు నిత్యమైన ఆత్మను ఎలా నాశనం చేస్తారు?  అవిద్యవలన కలిగిన దోషం వల్ల, ఉన్న ఆత్మను మరుగుపరుస్తారు.  ఆత్మను తెలిసికొనడంవలన కలిగే, జరామరణాలు లేకపోవడమనే లక్షణాల ఫలాలు, ఆత్మ భావన నశించిన వారిలో మరుగుపడిపోతాయి. అందుచేత, అజ్ఞానులైన జనులను ఆత్మహంతకులని అంటారు. వారు ఆత్మహననదోషంతో ప్రవర్తిల్లుతారు (జరా మరణాలని అనుభవిస్తారు).

       ఆత్మభావాన్ని హతం చేసే అజ్ఞానులు ఏవిధంగా పునర్జన్మిస్తారో, అందుకు విరుద్ధంగా అనాత్మను హతంచేసే విద్వాంసులు ఏవిధంగా స్వేచ్ఛపొందుతారో, ఆ ఆత్మ తత్త్వమేమిటో తెలియజేయబడుతోంది---

    అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్ |

తద్ధావతోఽన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి ||    .. 4 ..

 

          కదలనిది, ఏకం, మనసు కంటే వేగవంతం, ముందుగానే చేరియున్నందున ఇంద్రియాలు దాటలేనిది, స్థిరంగా ఉండి ఇతరములన్నింటినీ వేగంలో అధిగమించేది, అలా ఉండి అన్ని కార్యకలాపాలకు ఆధారమైనది. 

 

శంకర భాష్యమ్

అనేజత్ న ఏజత్ | ‘ఏజృ కమ్పనే’, కమ్పనం చలనం స్వావస్థాప్రచ్యుతిః, తద్వర్జితమ్, సర్వదా ఏకరూపమిత్యర్థః  |  తచ్చ ఏకం సర్వభూతేషు  | మనసః సంకల్పాదిలక్షణాత్ జవీయో జవవత్తరమ్ | కథం విరుద్ధముచ్యతే--- ధృవం నిశ్చలమిదమ్, మనసో జవీయ ఇతి చనైష దోషః, నిరుపాధ్యుపాధిమత్త్వేనోపపత్తే  |  తత్ర నిరుపాధికేన స్వేన రూపేణోచ్యతే--- అనేజదేకమ్ ఇతి  | మనసః అన్తఃకరణస్య సంకల్పవికల్పలక్షణస్యోపాధేరనువర్తనాత్  |  ఇహ దేహస్థస్య మనసో బ్రహ్మలోకాదిదూరస్థసంకల్పనం క్షణమాత్రాద్భవతీత్యతో మనసో జవిష్ఠత్వం లోకప్రసిద్ధమ్  |  తస్మిన్మనసి బ్రహ్మలోకాదీన్ ద్రుతం గచ్ఛతి సతి, ప్రథమప్రాప్త ఇవాత్మచైతన్యాభాసో గృహ్యతే  |  అతః మనసో జవీయః ఇత్యాహ  |  నైనద్దేవాః, ద్యోతనాద్దేవాః చక్షురాదీనీన్ద్రియాణి, ఏనత్ ప్రకృతమాత్మతత్త్వం నాప్నువన్ న ప్రాప్తవన్తః  |  తేభ్యో మనో జవీయః  |  మనోవ్యాపారవ్యవహితత్వాదాభాసమాత్రమప్యాత్మనో నైవ దేవానాం విషయీభవతి, యస్మాజ్జవనాన్మనసోఽపి పూర్వమర్షత్ పూర్వమేవ గతమ్, వ్యోమవద్వ్యాపిత్వాత్  |  సర్వవ్యాపి తదాత్మతత్త్వం సర్వసంసారధర్మవర్జితం స్వేన నిరుపాధికేన  స్వరూపేణావిక్రియమేవ సత్, ఉపాధికృతాః సర్వాః సంసారవిక్రియా అనుభవతీవావివేకినాం మూఢానామనేకమివ చ ప్రతిదేహం ప్రత్యవభాసత ఇత్యేతదాహ--- తత్, ధావతః ద్రుతం గచ్ఛతః అన్యాన్ ఆత్మావిలక్షణాన్మనోవాగిన్ద్రియప్రభుతీన్ అప్యేతి (అత్యేతి) అతీత్య జచ్ఛతీవ (గచ్ఛతీవ)  |  ఇవార్థం స్వయమేవ దర్శయతి-తిష్ఠదితి, స్వయమవిక్రియమేవ సదిత్యర్థః  |  తస్మిన్ ఆత్మతత్త్వే సతి నిత్యచైతన్యస్వభావే, మాతరిశ్వా మాతరి అన్తరిక్షే శ్వయతి గచ్ఛతీతి మాతరిశ్వా వాయుః సర్వప్రాణభృత్క్రియాత్మకః, యదాశ్రయాణి కార్యకరణజాతాని యస్మిన్నోతాని ప్రోతాని చ, యత్సూత్రసంజ్ఞకం సర్వస్య జగతో విధారయితృ, స మాతరిశ్వా, అపః కర్మాణి ప్రాణినాం చేష్టాలక్షణాని అగ్న్యాదిత్యపర్జన్యాదీనాం జ్వలనదహనప్రకాశాభివర్షణాదిలక్షణాని, దధాతి విభజతీత్యర్థః, ధారయతీతి వా, ’భీషాస్మాద్వాతః పవతే’ ఇత్యాదిశ్రుతిభ్యః  |  సర్వా హి కార్యకరణవిక్రియా నిత్యచైతన్యాత్మస్వరూపే సర్వాస్పదభూతే సత్యేవ భవన్తీత్యర్థః  ||

          న మన్త్రాణాం జామితాస్తీతి పూర్వమన్త్రోక్తమప్యర్థం పునరాహ -----

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          అనేజత్- కదలిక లేనిది.ఏజృ ధాతువునకు కంపనమని లేదా చలనమని లేదా తన స్థితి నుండి మార్పుచెందుట అని అర్థం. ఇట్టి మార్పుకు లోను కానిది.  అనేజత్అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో (రూపంలో) ఉండేది అని అర్థం. సర్వ భూతములలోనూ అది ఒక్కటే, మార్పు ఉండదు. జవీయః – వేగవత్తరం; సంకల్పాది లక్షణమైన మనస్సు కన్నా అది వేగవంతమైనది, బలవత్తరమైనది.

సందేహం : ఏమిటి విరుద్ధంగా చెప్పబడుతోంది ? --  ఇదంతా స్థిరం, నిశ్చలమని నిర్ణయిస్తూ, మనస్సుకంటే వేగవంతమయినది అంటున్నారు అదెలా ?

సమాధానం : వైరుధ్యమేమీ లేదు.  ఉపాధి, నిరుపాధుల పరంగా దీనిని (ఈ వైరుధ్యాన్ని) సమన్వయ పరుచవచ్చు. నిరుపాధిగా (ఉపాధి రహితంగా) అది తన స్వస్వరూపమైన మార్పుచెందని ఏకత్వంగా చెప్పబడింది. (సర్వత్రా వ్యాపించియే ఉండటం చేత, అది ఏ ఉపాధికి పరిమితం చేయబడి లేదు కనుక, అది నిశ్చలమే, స్థిరమే.)  సంకల్ప వికల్ప లక్షణాలు కల మనస్సు, అంతఃకరణాన్ని ఉపాధిగా చేసుకొంటుంది. ఇక్కడ దేహంలో స్థితమైన మనస్సు, ఎక్కడో దూరంగా ఉన్న బ్రహ్మ లోకాన్ని సంకల్పించిన క్షణంలో చేరుతోంది కాబట్టి, లోకంలో అన్నిటికంటే మనసు వేగవంతమైనదని ప్రతీతి. అట్టి మనసు బ్రహ్మాది లోకములను వేగంగా చేరునప్పటికే, అక్కడకు ముందుగానే చేరియున్న ఆత్మ (సర్వత్రా వ్యాపించియున్న ఆత్మ అక్కడకూడా అప్పటికే ఉన్నందుని) యొక్క అభాసయైన చైతన్యము దానిని (మనసు చేరినదనే విషయాన్ని) గ్రహిస్తోంది. అందుచే, అది (ఆత్మ చైతన్యము) మనసు కన్నా వేగవంతము. దేవాః– ఇంద్రియములు, తెలియపరచేవి కనుక (ద్యోతక పరచేవి కనుక) దైవములు, చక్షువు మొదలైన జ్ఞానేంద్రియలే దైవములు; ‘ఏనత్ – దానిని, ప్రస్తుతము విచారింపబడుతున్న ఆత్మను; న ఆప్నువన్ అధిగమించలేవు. వీనికంటే (ఇంద్రియముల కంటే) మనసు వేగవంతము.  మనసు యొక్క వ్యవహితమైన స్థితివల్ల (ఆత్మకూ ఇంద్రియాలకు మధ్యస్థంగా మనసు ఉండడం వల్ల) ఆత్మ యొక్క వ్యవహారములను ఇంద్రియాది దైవములు ఏమాత్రంకూడా గ్రహింపలేకున్నాయి. ఆకాశంవలే పూర్వమ్ అర్షత్’ - అంతకు పూర్వమే ఉండడం వల్ల, చేరి ఉండడం వల్లచ సర్వత్రా వ్యాపించియుండడం వల్ల, ఆత్మకు అన్యమైన వాటన్నింటికంటే ఆత్మ చైతన్యమే వేగవంతమైనది. సర్వత్రా వ్యాపించియున్న ఆ ఆత్మతత్త్వం తన స్వస్వరూపములో మార్పులేనిదై సర్వలోకధర్మాలను విసర్జించి ఉంటుంది. వివేకములేని మూఢులు అది (ఆ ఆత్మతత్త్వం) భిన్న దేహాలలో భిన్నంగా యున్నట్లుగా అనుభూతి చెందుతారు. అందుచేత, మంత్రంలో అలా చెప్పబడ్డది.  తత్ – అది (ఆ ఆత్మ); అత్యేతి – ఎలా ఉన్నదో అలాగే ఉండి అధిగమిస్తుంది. ధావతః అన్యాన్ – తనకన్నా భిన్నమైన, వేగవంతాలైన మనసు, వాక్కు వంటి ఇతర ఇంద్రియాలను. మంత్రంలోని తిష్ఠత్ పదం  ఎలా ఉన్నదో అలానేఅనే అర్థాన్ని సూచిస్తోంది.  అంటే, స్థిరంగా వికార రహితంగా (ఎటువంటి మార్పూ లేకుండా) ఉన్నది అనే అర్థంవచ్చేలా వాడబడింది. ‘తస్మిన్’ - నిత్యమైన (ఎల్లవేళలా) చైతన్యస్వభావంగా ఆత్మతత్త్వం అలా ఉంటూఉండగా; ‘మాతరిశ్వా– సర్వప్రాణులకూ ఆధారమై, క్రియాత్మకమై (మాతరి) అంతరిక్షంలో కదలాడుతూ, తిరుగాడుతూ (శ్వయతి) దేనిపై దేహేంద్రియాల కార్యకలాపములు ఆధారపడి ఉంటాయో, అట్టి వాయువు. ఏ సూత్ర సంజ్ఞచే (దారముచే) జగత్తు సర్వమూ అనుసంధానింపబడుతుందో అదే మాతరిశ్వ (వాయువు). ఆపః – కార్యములు (వేదములలో విధింపబడిన కర్మలలో సోమరసము, నేయి, పాలు వంటి ద్రవముల వినియోగము జరుగుతుంది కాబట్టి, ప్రాణులకు నీరు ఆధారమైనది కాబట్టి, ఆపః శబ్దము కార్య వ్యవహారములను సూచిస్తుంది). ప్రాణులలో వాని వాని చేష్టల లక్షణాలను, ఉదాహరణకు అగ్ని, ఆదిత్యుడు, పర్జన్యులకు జ్వలించుట, దహించుట, ప్రకాశించుట, వర్షించుట వంటి లక్షణాలను, దధాతి– కేటాయిస్తుంది లేదా వహింపచేస్తుంది.  అతని భయంచేత వాయువు వీస్తుంది అని [‘భీషాస్మాద్వాతః పవతే(తై.ఉ.2.8.1)] తైత్తిరీయోపనిషత్తు వర్ణిస్తుంది. నిత్యమైన ఆత్మ చైతన్యము వలననే, సర్వ భూతముల కార్యకరణ రూపాంతరాలు ప్రవర్తిల్లుతాయి.

          (ఆత్మ లక్షణాలని విశదపరుస్తున్నారీ మంత్రంలో.  ఆత్మ కదలదు.  అది కాక మరొకటి లేనేలేదు. అది మనసు కన్నా వేగవంతం.  అదేమిటిఒక పక్క ఆత్మ కదలదు అంటున్నారు.  మళ్ళా వెంటనే, అది మనసు కంటే వేగవంతం మంటున్నారు.  ఏమిటీ వైరుధ్యం?  అంటే, ఆత్మ సర్వత్రా వ్యాపించే ఉంటుంది.  అది లేని ప్రదేశమే లేదు.  వ్యాపించి ఉన్నది అని అంటే, అది వ్యాపించడానికి ముందు ఒక స్థితి, వ్యాపించిన తరువాత మరొక స్థితిని భావన చేయకూడదు.  వ్యాపించింది అని చెప్పినమాట కేవలం వ్యావహారికమే.  వ్యాపించడానికి పూర్వం అనే స్థితి అసలు ఉత్పన్నమే కాదు.  జగత్తు ఉన్నది అని అన్నామంటే, ఆ జగత్తు పూర్తిగా ఆత్మచే నిండి ఉన్నదనే అర్థం.  పూర్తిగా నిండి ఉన్నదానికి ఇక చలనమనే ప్రసక్తి ఏముంటుంది.  ఆ విధంగా అది కదలిక లేనిదే అవుతుంది.  మరి మనస్సు తన సంకల్ప వికల్పాలతో జగత్తులోని ఏ విషయాన్నైనా క్షణకాలంలో స్పృశిస్తుంది, చేరుతుంది.  ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే.  ఆ మనసు కూడా ఈ జగత్తులో ఒక భాగమే కదా.  అలాంటప్పుడు, ఆ మనసు ఉన్న ప్రదేశంలో కూడా ఆత్మ ఉన్నట్టే కదా.  అలాగే, ఆ మనస్సు సంకల్పించిన విషయం కూడా జగత్తులోనిదే.  ఆ విషయం ఉన్న ప్రదేశంలో కూడా ఆత్మ నిలచియే ఉంటుంది.  అంటే, సంకల్ప మాత్రంగా మనసు విషయాన్ని చేరే సరికే అక్కడ ఆత్మ ఉండనే ఉంది.  ఆ విధంగా మనసు కంటే ముందుగానే అక్కడకు ఆత్మ చేరినట్టే కదా!  అంటే, మనసు కన్నా ఆత్మ వేగవంతమైనదనే కదా చెప్పాలి.  అదే ఇక్కడ వివరిస్తున్నారు.  కాబట్టి, దీనిలో వైరుధ్యమేమీ లేదు అని స్పష్టమౌతోంది.

ఇక, ఇంద్రియాల విషయానికి వస్తే, అవి మనసు అధీనంలోనే వ్యవరిస్తుంటాయి.  అంటే, ఇంద్రియాల కంటే మనసు శక్తి వంతమైనది.  అంత శక్తివంతమైన మనస్సే ఆత్మను అధిగమించి వ్యవహరించలేక పోయినప్పుడు, ఇక ఇంద్రియాలు ఆత్మను ఎలా అధిగమిస్తాయి.  కాబట్టి, ఆత్మను ఇంద్రియాలు కూడా దానిని అధిగమించి ముందుకు వెళ్ళలేవు.  అది అలా స్థిరంగా అంతటా వ్యాపించి యుండి,  తనకు అన్యమైన వాటన్నింటికంటే శక్తివంతమై ఉంటుంది.)

అయితే, అలా సర్వత్రా నిండి కదలిక లేని ఆత్మ వలన ఉపయోగమేమిటి?  ఆ ఆత్మ వల్లనే జగత్తులోని సర్వ కార్యాలు నిర్వహింపబడతున్నాయి.  అంతరిక్షంలో తిరుగాడే వాయువు ఆ ఆత్మ వల్లనే సర్వప్రాణికొటికి జీవనాధారమౌతోంది.  అన్ని కార్య కలాపాలకు ఆధారమైన నీటి యొక్క ధర్మం కూడా ఆ ఆత్మ వలననే కలుగుతోంది.  అగ్నికి దహించే శక్తి కూడా ఆ ఆత్మ వలననే.)         

విషయాన్ని విశదీకరించడంలో వేద మంత్రాలు అలసత్వాన్ని ప్రదర్శించనివి అయినందున, పూర్వమంత్రములో చెప్పిన విషయాలే భావ పటిష్ఠతకై తదుపరి మంత్రాలలో పునరుద్ఘాటింపబడుతున్నాయి.  (వేదమంత్రాలు భావాన్ని పటిష్టంగా మనసులో పాదుకొనేందుకు శ్రమిస్తాయి.  ఏమాత్రం నిర్లక్ష్యం చేయవు.  ఒక విషయం పూర్తిగా అవగాహన కాలేదని అన్పిస్తే, దానిని మరొక కోణంలో ఆవిష్కరించి ఆ భావం సాధకునిలో స్థిరమయ్యేలా చేస్తాయి.  ఈదృష్టితోనే పైన చెప్పిన విషయాన్నే క్రింది మంత్రలో మరింత స్పష్టమయ్యేలా చేస్తున్నారు.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే |

తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||       .. 5 ..

         

          అది కదులుతుంది.  అది కదలదు.  అది దూరంగా ఉంది.  అది సమీపంగా ఉంది.  అది అన్నింటికీ లోపల ఉంది.  అది అన్నింటికి వెలుపల ఉంది.

 

శంకర భాష్యమ్

తత్ ఆత్మతత్త్వమ్ యత్ప్రకృతమ్ ఏజతి చలతి తదేవ చ నైజతి స్వతో నైవ చలతి, స్వతః అచలమేవ సత్ చలతీవేత్యర్థః | కించ, తద్దూరే వర్షకోటిశతైరప్యవిదుషామప్రాప్యత్వాద్దూరే ఇవ |(తద్ ఉ అన్తికే ఇతిచ్ఛేదః) తదు అన్తికే సమీపే అత్యన్తమేవ విదుషామ్, ఆత్మత్వాత్ న కేవలం దూరే, అన్తికే చ | తత్ అన్తః అభ్యన్తరే అస్య సర్వస్య, ’య ఆత్మా సర్వాన్తరః’ ఇతి శ్రుతేః, అస్య సర్వస్య జగతో నామరూపక్రియాత్మకస్య | తత్ ఉ (అపి) సర్వస్య అస్య బాహ్యతః; వ్యాపిత్వాదాకాశవన్నిరతిశయ- సూక్ష్మత్వాదన్తః; ’ప్రజ్ఞానఘన ఏవ’ ఇతి శాసనాన్నిరన్తరం చ ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

       తత్ – అది, విచారించబడే ఆ ఆత్మతత్త్వము, ఏజతి - కదలిక గలది మరియు న ఏజతి- కదలనిది.  స్వతఃసిద్ధంగా కదలనిది అయినా (సర్వత్రా వ్యాపకమైయున్నందున) కదలిక కలదిగా అనిపిస్తుంది అని అర్థం.  తత్ దూరే - అది దూరం, అది చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్లనంటే, శతకోటి సంవత్సరాల కాల పర్యంతమైనా అది అజ్ఞాని అందుకోలేనిది.  ‘తద్వన్తికే’ – తత్ ఉ అన్తికే - జ్ఞానులకు అది అత్యంత సమీపంలోనే, దూరమైనది కానే కాదు, అది వారి చైతన్యమే. అస్య సర్వస్యసర్వమునకు లోపలనున్న ఆత్మ’  అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్లుగా [‘య ఆత్మా సర్వాన్తరః’ (బృ.ఉ.3.4.1)] నామ, రూప, క్రియాత్మకమైన జగత్తు సర్వమునకూ; ‘తత్ అంతః – అది లోనిదే; తత్ – అది; ‘సర్వస్య అస్య బాహ్యతః - ఈ సర్వస్వానికి బాహ్యము, ఎందువల్లనంటే, ఆకాశమువలే అంతటా నిరతిశయంగా వ్యాపించినందున. – కూడా.  అత్యంత సూక్ష్మమైనందున అది లోపల కూడా విస్తరిస్తుంది. అది అవిఛ్ఛిన్నమైన శుద్ధచైతన్యము మాత్రమే’ [‘ప్రజ్ఞానఘన ఏవ(బృ.ఉ.4.5.13)] అని వేదం బృహదారణ్యకోపనిషత్తులో సూత్రీకరించింది.

            యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |

సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ||        .. 6 ..

 

ఎవడు సర్వభూతాలను ఆత్మగానే దర్శిస్తాడో, సర్వ భూతములలోనూ ఆత్మనే దర్శిస్తాడో, అతడు (ఆ స్థితి వల్ల దేనిపట్ల) హేయాన్ని (ద్వేషాన్ని) పొందడు.

 

శంకర భాష్యమ్

యస్తు పరివ్రాట్, ముముక్షుః సర్వాణి భూతాని అవ్యక్తాదీని స్థావరాన్తాని ఆత్మన్యేవ అనుపశ్యతి, ఆత్మవ్యతిరిక్తాని న పశ్యతీత్యర్థః | సర్వభూతేషు (చ) తేష్వేవ చ ఆత్మానం తేషామపి భూతానాం స్వమాత్మానమాత్మత్వేన -- యథాస్య దేహస్య కార్యకరణసంఘాతస్యాత్మా అహం సర్వప్రత్యయసాక్షిభూతశ్చేతయితా కేవలో నిర్గుణోఽనేనైవ స్వరూపేణావ్యక్తాదీనాం స్థావరాన్తానామహమేవాత్మేతి సర్వభూతేషు చాత్మానం నిర్విశేషం యస్త్వనుపశ్యతి, సః తతః తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే (విజుగుప్సాం) ఘృణాం న కరోతి | ప్రాప్తస్యైవానువాదోఽయమ్ | సర్వా హి ఘృణా ఆత్మనోఽన్యద్దుష్టం పశ్యతో భవతి ఆత్మానమేవాత్యన్తవిశుద్ధం నిరన్తరం పశ్యతో న ఘృణానిమిత్తమర్థాన్తరమస్తీతి ప్రాప్తమేవ --- తతో న విజుగుప్సత ఇతి ||

ఇమమేవార్థమన్యోఽపి మన్త్ర ఆహ ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

యః – ముక్తిని పొందగోరే ముముక్షువు, పరివ్రాజకుడు; ‘సర్వాణి భూతానిసర్వభూతములయందునూ, అవ్యక్తమైన వాటితో మొదలుపెట్టి కదలని వాటితో సహా (స్థావరములు అనగా చెట్లతో సహా), ఆత్మని ఏవ – ఆత్మని మాత్రమే; ‘అనుపశ్యతి – దర్శిస్తాడు; అంటే, అవి ఆత్మకు భిన్నమైనవిగా వానికి గోచరింపవు. సర్వ భూతేషు చ - సకల ప్రాణులలోను; ‘ఆత్మానమ్ - ఆత్మను దర్శిస్తారు – ఏ విధంగా, స్వదేహ గతమైన ఆత్మ, కార్యకరణాల సంఘటిత స్వరూపమైనదై, నేనే అన్ని అనుభూతులకు సాక్షిననే భావన కలదై, కేవలం గుణ రహితమై యున్నదో అదే విధంగా, అవ్యక్తమైన కదలలేని ప్రాణులతో సహా సర్వ భూతములలోనూ నిర్విశేష స్వరూపంగా ఉన్న సమిష్టిఆత్మకూడా తానేననే భావిస్తారు. తతః - ఆ విధంగా దర్శించిన వానికి; న విజిగుప్సతే’ - జుగుప్సత యుండదు. హేయత్వము, ద్వేషభావము ఉండదు. ఇది అనుభవములోనున్న విషయమే. తనకు భిన్నమైన వాటిపై ద్వేషము లేదా వ్యతిరేకత ఉంటుంది. కాని, అత్యంత పరిశుద్ధమైన ఆత్మనే, అంతటా ఎటువంటి అంతరాలు లేకుండా, దర్శిస్తున్నప్పుడు విబేధించడానికి కారణమైనదేదీ లేదు కదా. కాబట్టి,  వారికిక ద్వేషమే లేదు.

మరొక మంత్రం కూడా ఈ విషయాన్నే విశదీకరిస్తోంది.

యస్మిన్సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః |

తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః ||            .. 7 ..

 

సర్వ భూతములూ ఆత్మయే అని అనుభవించి తెలిసికొని ఏకత్వాన్ని దర్శించిన వానికి, ఇక మోహమేది శోకమేది.

 

శంకర భాష్యమ్

యస్మిన్సర్వాణి భూతాని యస్మిన్ కాలే యథోక్తాత్మని వా, తాన్యేవ భూతాని సర్వాణి పరమార్థాత్మదర్శనాత్ ఆత్మైవాభూత్ ఆత్మైవ సంవృత్తః పరమార్థవస్తు విజానతః, తత్ర తస్మిన్కాలే తత్రాత్మని వా, కో మోహః కః శోకః | శోకశ్చ మోహశ్చ కామకర్మబీజమజ్ఞానతో భవతి, న త్వాత్మైకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః | కో మోహః కః శోక ఇతి శోకమోహయో- రవిద్యాకార్యయోరాక్షేపేణాసంభవ ప్రకాశనాత్ (ప్రదర్శనాత్) సకారణస్య సంసారస్యాత్యన్తమేవోచ్ఛేదః ప్రదర్శితో భవతి || 

యోఽయమతీతైర్మన్త్రైరుక్త ఆత్మా, స స్వేన రూపేణ కింలక్షణ ఇత్యాహ అయం మన్త్రః --

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

        ‘యస్మిన్ విజానతః – ముందు చెప్పబడిన ఆత్మతత్త్వాన్ని ఎఱిగిన ఆ సమయంలో, వారికి మాత్రమే (ఆ ఎఱుకగలిగిన వారికి మాత్రమే); సర్వాణి భూతాని– సర్వ భూతములు; ‘ఆత్మ ఏవ అభూత్’ - ఆత్మయేననే అనుభవం కలిగి-పరమాత్మానుభవం పొందిన ఫలితంగా; తత్ర – ఆ సమయంలో (లేదా అట్టి ఆత్మకు); ‘కః మోహః కః శోకః’ - మోహమెక్కడ? శోకమెక్కడ?  కోరికల, కర్మల మూలాన్ని తెలియని అజ్ఞానికే దుఃఖము, మోహమూ కలుగుతాయి. ఆత్మను గగనసదృశంగా, ఏకమైనదిగా, శుద్ధమైనదిగా దర్శించేవానికి కాదు. కో మోహః కః శోకః - అసంభవమైన, ఆక్షేపణీయమైన శోకమోహములు జ్ఞానవిహీనత వల్ల ప్రదర్శితమౌతున్నవనీ, అప్పుడు (ఆత్మ జ్ఞానం అనుభవమైన సమయంలో) సంసారాన్ని, దాని మూలమైన కారణంతో సహా నిర్మూలించడం చేత ఇక మోహానికి, శోకానికీ తావేలేదనీ చూపబడుతోంది.

            తదుపరి మంత్రం, ముందు చెప్పిన మంత్రాలలో చెప్పబడిన ఆత్మ యొక్క నిజరూప లక్షణాన్ని విశదీకరిస్తోంది.

                  స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణ                                                                                                                 మస్నావిరగ్o శుద్ధమపాపవిద్ధమ్ |                                                                                                                 కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యాథాతథ్యతోఽర్థాన్ 

                  వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః        .. 8 ..

 

        అన్నిదిశలా వెళ్ళిన, శుభ్రమైన, శరీరము లేని, వికలత్వం లేని, నరాలు నాడులు లేని, నిర్మలమైన, పాపసంబంధం లేని, సర్వాన్నీ తెలుసుకొనే, మనసును శాసించే, సర్వాన్ని ఆవరించి అంతా తానై స్వయంగా ఉండి ఆతడు (పరమాత్మ) శాశ్వత కాల స్వరూపులకు వారి వారి సమర్థతకు తగిన కర్తవ్యాలను కేటాయించాడు.

 

శంకర భాష్యమ్

   స పర్యగాత్, సః యథోక్త ఆత్మా పర్యగాత్ పరి సమన్తాత్ అగాత్ గతవాన్, ఆకాశవద్ వ్యాపీత్యర్థః | శుక్రం శుభ్రం (శుద్ధం) జ్యోతిష్మత్ దీప్తిమానిత్యర్థః | అకాయమ్ అశరీరం లింగశరీరవర్జిత ఇత్యర్థః | అవ్రణమ్ అక్షతమ్ | అస్నావిరమ్ స్నావః శిరా యస్మిన్న విద్యన్త ఇత్యస్నావిరమ్ | అవ్రణమస్నావిరమిత్యేతాభ్యాం స్థూలశరీరప్రతిషేధః | శుద్ధం నిర్మలమవిద్యామలరహితమితి కారణశరీరప్రతిషేధః | అపాపవిద్ధం ధర్మాధర్మాదిపాపవర్జితమ్ | శుక్రమిత్యాదీని వచాంసి పుంలింగత్వేన పరిణేయాని, స పర్యగాత్ ఇత్యుపక్రమ్య కవిర్మనీషీ ఇత్యాదినా పుంలింగత్వేనోపసంహారాత్ | కవిః క్రాన్తదర్శీ సర్వదృక్, ‘నాన్యోఽతోఽస్తి ద్రష్టా ’ ఇత్యాదిశ్రుతేః | మనీషీ మనస ఈషితా, సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థః | పరిభూః సర్వేషాం పరి ఉపరి భవతీతి పరిభూః | స్వయంభూః స్వయమేవ భవతీతి, యేషాముపరి భవతి యశ్చోపరి భవతి స సర్వః స్వయమేవ భవతీతి స్వయంభూః | స నిత్యముక్త ఈశ్వరః యాథాతథ్యతః సర్వజ్ఞత్వాత్ యథాతథాభావో యాథాతథ్యం తస్మాత్ యథాభూతకర్మఫలసాధనతః అర్థాన్ కర్తవ్యపదార్థాన్ వ్యదధాత్ విహితవాన్, యథానురూపం వ్యభజదిత్యర్థః | శాశ్వతీభ్యః నిత్యాభ్యః సమాభ్యః సంవత్సరాభ్యైభ్యః ప్రజాపతిభ్య ఇత్యర్థః ||

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          ‘సః - ముందు చెప్పబడిన ఆత్మ; పర్యగాత్’ – సర్వవ్యాపకమైనది; ‘పరి’ –అన్నివైపులా; ‘అగాత్’ – వెళ్ళినది; (ఆకాశము వలే వ్యాపించియున్నదని అర్థం.) ‘శుక్రమ్ - జ్యోతవంతమై ప్రకాశించునది; అకాయమ్’ -శరీరములేనిది, లింగ శరీరమునకూ భిన్నమైనది; ‘అవ్రణమ్’ - క్షతములేనిది (వైకల్యము లేనిది); ‘అస్నావిరమ్స్నావః సిరలు (నరాలు, నాడులు), అవి లేకపోవుట అస్నావిరమ్. అవ్రణమ్, అస్నావిరమ్ వంటి పదాలు స్థూలశరీరాన్ని నిషేధిస్తున్నాయి (ఆత్మ స్థూలశరీరానికి భిన్నమని).  శుద్ధం, నిర్మలం, అవిద్యాదోషరహితం వంటి లక్షణాలు కారణశరీరానికి భిన్నత్వాన్ని చూపుతున్నాయి. అపాపవిద్ధమ్’ – ధర్మము, అధర్మముల రూపమైన పాపముచేత అంటబడనిది.   పుంలింగ శబ్దాలైన స పర్యగాత్ తో మొదలై మంత్రం కవిర్మనీషి తో ముగిసినందున శుక్రమ్ మొదలైన పదాలను పుంలింగ శబ్దాలుగా మార్చుకోవాలి. కవిః’ - భూత, భవిష్యత్, వర్తమానాలను దర్శించేవాడు, సర్వాన్నీ చూడగలిగినవాడు. ఇతర ద్రష్టలు లేరు’ [‘నాన్యోఽతోఽస్తి ద్రష్టా’ (బృ.ఉ.3.8.11)] అని శ్రుతి వాక్యం. మనీషి- మనసును శాసించేవాడు, సర్వమూ తెలిసినవాడు, ఈశ్వరుడు; ‘పరిభూః- సర్వాన్నీ ఆవరించి, అధిగమించి ఉన్నవాడు; ‘స్వయంభూః– స్వయమ్ భవతి, స్వయముగా (ఇతర ప్రమేయం లేకుండా) ఉన్నవాడు. సర్వాన్నీ స్వయంగా ఆవరించి, అధిగమించి యున్నాడని స్వయంభూః పదం సూచిస్తోంది.  అతడు, ఎల్లవేళలా ముక్తుడైన ఈశ్వరుడు, సర్వమూ తెలిసినవాడై, వారి వారి సమర్థతకు తగినట్లుగా, యాథాతథ్యతః – ఎలా ఉండాలో అలా; ‘శాశ్వతీభ్యః సమాభ్యః – శాశ్వత కాలాలకు (శాశ్వతంగా), కాలస్వరూపులకు (ప్రజాపతులకు); ‘అర్ధాన్ – కర్తవ్యములను (విధులను); ‘వ్యదధాత్– విభజించాడు, కేటాయించాడు. శాశ్వతులు, నిత్యులు, కాలరూపులు, సంవత్సరములు మొదలైన వాటిచే వ్యాఖ్యానించబడే వారు అని ప్రజాపతులకు అర్థం.

 

శంకర భాష్యమ్

అత్రాద్యేన మన్త్రేణ సర్వైషణాపరిత్యాగేన జ్ఞాననిష్ఠోక్తా ప్రథమో వేదార్థః ఈశావాస్యమిదం సర్వమ్…......మా గృధః కస్య స్విద్ధనమ్’ ఇతి | అజ్ఞానాం జిజీవిషూణాం జ్ఞాననిష్ఠాఽసంభవే కుర్వన్నేవేహ కర్మాణి ….......జిజీవిషేత్’ ఇతి కర్మనిష్ఠోక్తా ద్వితీయో వేదార్థః | అనయోశ్చ నిష్ఠయోర్విభాగో మన్త్రద్వయప్రదర్శితయోర్బృహదారణ్యకేఽపి దర్శితః --- సోఽకామయత్ జాయా మే స్యాత్’ ఇత్యాదినా | అజ్ఞస్య కామినః కర్మాణీతి | ‘మన ఏవాస్యాత్మా వాగ్జాయా’ ఇత్యాదివచనాత్ | అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్ఠస్య నిశ్చితమవగమ్యతే | తథా చ తత్ఫలం సప్తాన్న సర్గస్తేష్వాత్మభావేన ఆత్మస్వరూపావస్థానమ్ | జాయాద్యేషణాత్రయ సంన్యాసేన చాత్మవిదాం కర్మనిష్ఠాప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్ఠైవ దర్శితా --- కిమ్ ప్రజయా కరిష్యామో ఏషాం నోఽయమాత్మాయం లోకః’ ఇత్యాదినా | యే తు జ్ఞాననిష్ఠాః సంన్యాసినస్తేభ్యః అసుర్యా నామ తే’ ఇత్యాదినా అవిద్వన్నిన్దాద్వారేణాత్మనో యాథాత్మ్యమ్ స పర్యగాత్’ ఇత్యేతైర్మన్త్రైరుపదిష్టమ్ | తే హ్యత్రాధికృతా న కామిన ఇతి | తథా చ శ్వేతాశ్వతరాణాం మన్త్రోపనిషది __ ‘అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగృషిసంఘజుష్టమ్’ ఇత్యాది విభజ్యోక్తమ్ | యే తు కామినః (కర్మిణః) కర్మనిష్ఠాః కర్మ కుర్వన్త ఏవ జిజీవిషవః, తేభ్య ఇదముచ్యతే --- అన్ధం తమః’ ఇత్యాది |

కథం పునరేవమవగమ్యతే, న తు సర్వేషామ్ ఇతి? ఉచ్యతే ___ అకామినః సాధ్యసాధనభేదోపమర్దేనయస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః | తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యత’ ఇతి యత్ ఆత్మైకత్వవిజ్ఞానమ్, తత్ర కేనచిత్కర్మణా జ్ఞానాన్తరేణ వా హ్యమూఢః సముచ్చిచీషతి | ఇహ తు సముచ్చిచీషయా అవిద్వదాదినిన్దా క్రియతే | తత్ర చ యస్య యేన సముచ్చయః సంభవతి న్యాయతః శాస్త్రతో వా తదిహోచ్యతే | తద్దైవం విత్తం దేవతావిషయం జ్ఞానం కర్మసంభన్ధిత్వేనోపన్యస్తం న పరమాత్మజ్ఞానమ్, ‘విద్యయా దేవలోకః’ ఇతి పృథక్ఫలశ్రవణాత్ | తయోర్జ్ఞానకర్మణోరిహైకైకానుష్ఠాననిన్దా సముచ్చిచీషయా, న నిన్దాపరైవ ఏకైకస్య, పృథక్ఫలశ్రవణాత్ --- విద్యయా తదారోహన్తి విద్యయా దేవలోకః న తత్ర దక్షిణా యాన్తి కర్మణా పితృలోకః’ ఇతి | న హి శాస్త్ర విహితం కించిదకర్తవ్యతామియాత్ |

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

ప్రథమ మంత్రంలో, ఈషణాత్రయాన్ని త్యజించిన జ్ఞాన నిష్ఠులకు ఈశావాస్యమిదం సర్వం … మా గృథ కస్య స్విద్ధనమ్ఈ సర్వమూ ఈశ్వరునితో కప్పివేయాలనీ, …........ ఎవరి ధనాన్ని ఆశించవద్దనీ వేదం యొక్క మొదటి ప్రధాన ఉద్దేశ్యం చెప్పబడింది. జ్ఞాననిష్ఠత్వం లేని, జీవించాలి అనుకునే, అజ్ఞానులకు వేదం యొక్క రెండవ ఉద్దేశ్యమైన కర్మనిష్ఠత్వాన్ని కుర్వన్నేవేహ కర్మాణి ….......న లిప్యతే నరే’ అనగా అగ్నిహోత్రాది కర్మలు నిర్వర్తించడం మినహా వేరే మార్గము లేదనే విషయాన్ని రెండవ మంత్రంలో చెప్పారు. ఈ విధమైన రెండు జీవన విధానాలనే బృహదారణ్యకోపనిషత్తులో కూడా చూడవచ్చు. ‘నాకొక భార్య కావాలి అని అతడు కోరాడు’ [‘సోఽకామయత్ జాయా మే స్యాత్’ (బృ.ఉ.1.4.17)]   మొదలైన మంత్రాలలో అజ్ఞాని కోరికల సాధనకు కర్మలు విధింపబడ్డాయి.  అతనికి మనసే ఆత్మ, వాక్కే భార్య’ [‘మన ఏవాస్యాత్మా వాగ్జాయా’ (బృ.ఉ.1.4.17)] వంటి వాక్యాల ద్వారా కర్మనిష్ఠులకు అజ్ఞానమూ, కోరికలూ సహజలక్షణాలని అర్థమవుతుంది. కాబట్టి, ఈ కర్మల వల్ల కలిగేవి సప్త ఫలాలు (సామాన్యమైన మనుష్యా ఆహారము, దేవాహారమైన హుతము, ప్రహుతము లేదా దర్శ, పూర్ణమాస; ఆత్మాహారములైన మనసు, వాక్కు, ప్రాణము; పశువులకు ఆహారమైన పాలు) మరియు వాటితో తాదాత్మ్యత.  నేను ఆత్మననే భావంతో ఉన్న వానికి పుత్రులతో ప్రయోజనమేమున్నది’ [‘కిమ్ ప్రజయా కరిష్యామో ఏషాం నోఽయమాత్మాయం లోకః’  (బృ.ఉ.4.4.22)] అన్న శ్రుతి వాక్యాన్ని చూస్తే అత్మభావమెరిగి ఆత్మయే సత్యమైనదనే అనుభూతి చెంది ఈషణాత్రయాన్ని(దారేషణ, ధనేషణ, పుత్రేషణాలు – భార్య, ధనం, సంతతి పై కోరికలను త్యాగంచేయుట) త్యజించిన వారికి, కర్మలను కొనసాగించే కర్మనిష్ఠులకు భిన్నంగా, ఆత్మలో నిలచి ఉండటమే సూచింపబడుతోంది. అసుర్యా నామ తే తో మొదలైన మంత్రంలో (3వ మంత్రంలో) అజ్ఞానిని నిందించిన తర్వాత, స పర్యగాత్…......అన్నది చివరి మంత్రంగాగల (8వ మంత్రం) మంత్ర సముదాయంలో (అంటే 4వ మంత్రం నుండి 8వ మంత్రం వరకూ) జ్ఞానమార్గంలో స్థిరమైన వారికి, ఆత్మయొక్క లక్షణాలను విశదపరుస్తూ, వారు (జ్ఞానమార్గంలో స్థిరమైన వారు) మాత్రమే అందుకు తగిన అర్హతలూ, యోగ్యతలూ కలిగిన వారనీ, కోరికలు గలిగిన వారు అందుకు అనర్హులనీ తెలియపరుచబడింది. ఈ విషయమే శ్వేతాశ్వతరోపనిషత్తులో ప్రత్యేకంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలనధిగమించిన వారు పరమ పవిత్రమై, ఋషి సంఘంచే గొప్పదని శ్లాఘించే, ఈ సత్యాన్ని చక్కగా వచిస్తారు’ [‘అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగృషిసంఘజుష్టమ్’ (శ్వే.ఉ.6.21)] అని చెప్పబడింది. కానీ, అన్ధం తమః’ తో మొదలయ్యే ఈ క్రింది మంత్రాలు (9వ మంత్రం నుండి) కోరికలు లేదా కర్మలపై ఆసక్తి కల్గిన వారికి, కర్మాచరణం చేస్తూ జీవితాన్ని గడిపేవారికై చెప్పబడబోతున్నాయి.

సందేహం : ఇవి (ఈ కర్మలు) అందరకూ (కర్మలపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే కాక సన్యసించిన వారికి కూడా) ఉద్దేశించినవి కాదని తెలియడమెలా?

సమాధానం : ‘యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః’ (ఈ సర్వ భూతజాలము ఆత్మయే నని అనుభవమైన జ్ఞానికి మోహ శోకములెక్కడ? అతడు అంతటా ఏకత్వాన్ని దర్శిస్తాడు) అనే  మంత్రం ద్వారా (7వ మంత్రం) ఆత్మ ఏకమనే విజ్ఞానం కలిగి, కోరికలు నశించిన వాడు – సాధించే వస్తువుకు సాధనకు మధ్య తేడా లేదని – అవగతం చేసుకొంటాడు. మూఢుడు మాత్రం కర్మలనూ ఇతర విద్యలనూ (దేవతా పరమైన ఉపాసనలనే) జ్ఞానంగా భ్రమించి, ఆ రెండింటినీ అనుసంధానం చేస్తూ అదే సరియైనదనుకొంటాడు. ఈ విధంగా కర్మలను, మిథ్యాజ్ఞానాన్ని అనుసంధానంచేసి అదే జ్ఞానంగా భావించే అవిద్యాపరుని  నిందించడం ఇక్కడ జరుగుతోంది.  ఈ సందర్భంలో కర్మలు మరియు ఈ మిథ్యాజ్ఞానాల అనుసంధానం నియమాల ప్రకారంగాని, శాస్త్ర సమ్మతంగా గాని ఎంతవరకు సముచితమో చెప్పబడుతోంది.  కర్మ సంబంధంగా కలిగిన దైవీసంపదల విషయమైన జ్ఞానం, పరమాత్మ జ్ఞానం కాదు.  ఎందువల్లనంటే, విద్యచేత లేదా ఉపాసనచేత దేవతా జ్ఞానము లేదా దేవలోకము ప్రాప్తమగునని ఫలశృతి [విద్యయా దేవలోకః’ (బృ.ఉ.1.5.16)].  ఈ ఫలం (అంటే, ఈ దేవలోక ప్రాప్తి అనే ఫలితం) పరమాత్మజ్ఞానానికి భిన్నమైనది. విద్య లేదా దేవతా జ్ఞానము చేత దేవలోకము అధిరోహిస్తారు’ [‘విద్యయా తదారోహంతి ()], ‘విద్య లేదా దేవతా జ్ఞానము చేత దేవలోక ప్రాప్తి’ [‘విద్యయా దేవలోకః (బృ.ఉ.1.5.16)], ‘దక్షిణ యానము చేయువారు అక్కడకు, అనగా దేవలోకమునకు, చేరరు’ [‘న తత్ర దక్షిణా యాన్తి ()], కర్మానుష్ఠానము వల్ల పితృలోక ప్రాప్తి’ [‘కర్మణా పితృలోకః (బృ.ఉ.1.5.16)] అని శృతి చెప్తోంది. వేద విహిత కర్మానుష్ఠానములో కర్తృత్వము లేకుండుట అనేది లేదు (కర్తృత్వము అనేది తప్పదు).

అన్ధం తమః ప్రవిశన్తి యేఽవిద్యాముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్o రతాః ||  .. 9 ..

         

కర్మోపాసకులు కానరాని చీకటిని ప్రవేశిస్తారు.  దేవతోపాసన చేసేవారు అంతకంటే గాఢమైన చీకటిని (ప్రవేశిస్తారు).           

 

శంకర భాష్యమ్

అన్ధం తమః అదర్శనాత్మకం తమః ప్రవిశన్తి | కే? యే అవిద్యాం, విద్యాయా అన్యా అవిద్యా (తాం) కర్మేత్యర్థః, కర్మణో విద్యావిరోధిత్వాత్, తామవిద్యామగ్నిహోత్రాదిలక్షణామేవ కేవలామ్ ఉపాసతే తత్పరాః సన్తోఽనుతిష్ఠన్తీత్యభిప్రాయః | తతః తస్మాదన్ధాత్మకాత్తమసః భూయ ఇవ బహుతరమేవ తే తమః ప్రవిశన్తి | కే? కర్మ హిత్వా యే ఉ యే తు విద్యాయామేవ దేవతాజ్ఞానే ఏవ రతాః అభిరతాః ||

తత్రావాన్తరఫలభెదం విద్యాకర్మణోః సముచ్చయకారణమాహ | అన్యథా ఫలవదఫలవతోః సంనిహితయోరఙ్గాఙ్గితయా జామితైవ స్యాదితి (సంనిహితయోరఙ్గాఙ్గితైవ స్యాదిత్యర్థః) ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

అన్ధమ్ తమః – అదర్శనాత్మకమైన చీకటిని; ప్రవిశన్తి – ఫ్రవేశిస్తారు; ఎవరు? ‘యే అవిద్యామ్ – ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వారు, అనగా కర్మనిష్ఠులు. విద్యకు భిన్నమైనది అవిద్య.  అంటే కర్మ.  ఎందువల్లనంటే, కర్మ విద్యకు విరుద్ధమైనది. అగ్నిహోత్రాది లక్షణమైన కేవలం అవిద్యను మాత్రమే (లేదా వేదవిహిత కర్మనుమాత్రమే); ఉపాసతే’ – మనస్ఫూర్తిగా అనుష్టించేవారు; తతః’ – అంతకంటే (పైన చెప్పిన చీకటి కంటే); భూయ ఇవ’ – మరింత గాఢమైన; తమః’ – చీకటిని; తే వారు; ప్రవేశిస్తారు. ఎవరు? విద్యాయామ్ ఉ రతాః’ – దేవతాజ్ఞాన సంబంధమైన కర్మలలో (లేదా మిథ్యావిద్యలయందు) మాత్రమే నిమగ్నమైన వారు. (అనగా వైదిక కర్మానుష్ఠానాన్ని వీడి కేవలం దేవతాజ్ఞాన సంబంధ ఉపాసనలయందు మాత్రమే తత్పరులై కర్మను ఆచరించేవారు మరింత గాఢతరమైన అంధతామిస్రమును ప్రవేశిస్తారు అని అభిప్రాయము.)

ఇక్కడ అనుషంగికమైన ఫలాలలో (ప్రధానంగా లభించే ప్రాథమికమైన ఫలమే కాకుండా దానితో పాటు అప్రయత్నంగా లభించే ఇతర ఫలాన్ని అనుషంగిక ఫలం లేదా గౌణఫలం అంటారు)  చూపబడిన తేడా విద్య (దేవతా సంబంధమైన మిథ్యాజ్ఞానం) మరియు కర్మల (వేదవిహితమైన కర్మల)  అనుసంధానాన్నే సూచిస్తోంది. ( వేద విహిత కర్మల వల్ల లభించే పితృలోక ప్రాప్తికీ, దేవతా ఉపాసన వల్ల కలిగే దేవలోక ప్రాప్తికీ భిన్నత్వం ఉన్నది కదా.  అలా ప్రాథమిక ఫలాలలో తేడా ఉన్నట్లే, వేద విహిత కర్మల వల్ల కానరాని చీకటిని ప్రవేశించడం అనే అనుషంగిక ఫలితం, దేవతా ఉపాసన వల్ల అంతకంటే గాఢమైన చీకటిని ప్రవేశించడం అనే అనుషంగిక ఫలితానికి భిన్నం.  కాబట్టి, ప్రధాన ఫలాలలో భిన్నత్వమే కాకుండా, అనుషంగిక ఫలాలలో కూడా భిన్నత్వం ఉన్నది.  అందుచేత, అనుషంగిక ఫలితాలలోని భిన్నత్వం కూడా కర్మలు మరియు దేవతా ఉపాసనల యొక్క అనుసంధానాన్నే సూచిస్తోంది.) అలా కాకుండా, సన్నిహితమైన ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఫలితాన్నిచ్చి రెండవది ఫలితమివ్వకపోతే, ఫలితాన్నిచ్చిన దానిలో ఫలితమివ్వనిది భాగమౌతుంది. (విద్యలు కర్మలు ఒకదానిలో మరొకటి అంగాలు అన్నట్లుగా కొందరు చెపుతారు.  అదే నిజమైతే, ఈ రెంటిలో దేనికో ఒక దానికి ఫలితం చెప్పబడి ఉండకూడదు.  అప్పుడు, ఫలితం చెప్పబడనిది ఫలితం చెప్పబడిన దానిలో భాగం లేదా అంగమౌతుంది.  కానీ, ఇక్కడ వాటికి భిన్నమైన ఫలాలు చెప్పబడ్డవి.  అవి ఒకదానిలో మరొకటి భాగమైతే, ఈ విధంగా భిన్న ఫలాలు ఉండవు.  కాబట్టి, విద్య, కర్మలు ఒకదానికి మరొకటి భాగమనేది అసంబద్ధమైన విషయం.  మరింకా ఏమంటే, మనుష్యులు వారి వారి ప్రవృత్తిని బట్టి దేవతా ఉపాసనలు మరియు వేదోక్త కర్మలు చేస్తూ వాటికి తగినట్లుగా భిన్నమైన ఫలాలు పొందుతుంటారు.  అవి – దేవతా ఉపాసనలు, కర్మలు – ఒకదానికి మరొకటి భాగమైతే ఇలా జరగదు గదా.  కాబట్టి, వాటి అనుసంధానమే సూచింపబడుతోంది.)

అన్యదేవాహుర్విద్యయాఽన్యదాహురవిద్యయా 

ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే ||    .. 10 ..

 

          విద్య వలన భిన్నమైన (ఫలితం), అవిద్య వలన వేరొక (ఫలితం) అన్న ధీమంతుల వచనాలను, మాకు వాటిగురించి వివరంగా బోధించిన ఆచార్యులు చెప్పగా, విన్నాం.

 

శంకర భాష్యమ్

అన్యత్ పృథగేవ విద్యయా క్రియతే ఫలమితి ఆహుః వదన్తి, అన్యదాహురవిద్యయా కర్మణా క్రియతే ఫలమితి | తథోక్తమ్ --- ’కర్మణా పితృలోకః, విద్యయా దేవలోకః’ ఇతి | ఇతి  ఏవం శుశ్రుమ శ్రుతవన్తో వయం ధీరాణాం ధీమతాం వచనమ్ | యే ఆచార్యా నః అస్మభ్యం తత్ కర్మ చ జ్ఞానం చ విచచక్షిరే వ్యాఖ్యాతవన్తః, తేషామయమాగమః పారమ్పర్యాగత ఇత్యర్థః ||

యత ఏవమతః ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          ‘విద్యయా– విద్య వల్ల, అనగా దేవతావిషయ ఉపాసన వల్ల; ‘అన్యత్ ఏవ’ – పూర్తిగా భిన్నమైన ఫలం, ఆహుః’ – చెప్పారు; ఇదే విషయం దేవతా ఉపాసన వల్ల దేవలోక ప్రాప్తి అని [‘విద్యయా దేవలోకః’ (బృ.ఉ.1.5.16)] చెప్పబడింది. అన్యత్ అవిద్యయా – అవిద్య అనగా వేదోక్త కర్మానుష్ఠానం వలన వేరైన ఫలితం కలుగుతుంది.  ఇదే శృతి వాక్యం కర్మల వలన పితృలోక ప్రాప్తి’ [‘కర్మణా పితృలోకః’ (బృ.ఉ.1.5.16)] ద్వారా కూడా నిశ్చయమైంది. (అంటే, దేవతా ఉపాసనకు, వేదవిహిత కర్మానుష్ఠానానికి విడి విడిగా నిశ్చితమైన ఫలాలు చూపబడ్డాయి). ఇతి– ఈ విధంగా; ‘శుశ్రుమ– మేము విన్నాము; ‘ధీరాణాం– ధీమంతుల (పండితుల) వచనాలను; ‘యే– ఏ ఆచార్యులైతే; ‘నః– మాకు; ‘తత్– ఆ కర్మ (వేదవిహిత కర్మ) మరియు జ్ఞానము (దేవతావిషయక జ్ఞానం) లను; ‘విచచక్షిరే– సవివరంగా బోధించారో.  ఉద్దేశ్యమేమంటే, ఈ బోధ వారికి ఆగమాలనుండి గురుశిష్య పరంపరగా ప్రాప్తించినదని అర్థం.

          (వేదవిహిత కర్మలను అంటే అవిద్యను ఉపాసించినందువలన పితృలోకాన్ని పొందుతారనీ, దేవతా ఉపాసన అంటే విద్యను ఉపాసించినందువలన దేవలోకాన్ని పొందుతారనీ శృతి వాక్యాలు నిర్ధారిస్తున్నాయి.  ఈ విషయాన్ని ప్రాచీన పండితులు చెప్పినట్లుగా, మాకు వేదవిహిత కర్మలగురించీ, దేవతా ఉపాసనల గురించీ మాకు వివరంగా తెలియచేసిన మా ఆచార్యులు చెప్పగా విన్నాం.  అంటే,  ఈ విషయాన్ని దర్శించిన ధీమంతులు లేదా పండితులు చాలా కాలము క్రిందటి వారు.  వారు చెప్పిన ఈ విషయం గురుశిష్య పరంపరగా చెప్పబడుతూ ఉండగా, ప్రస్తుతపు మహర్షులకు – అంటే ఈ ఉపనిషత్తును ఉపదేశించిన మహర్షులకు – వారి గురువుగారిచేత చెప్పబడింది.  వేదవిహిత కర్మలు మరియు దేవతా ఉపాసనలగురించి బోధించే సందర్భంలో, ఈ విషయాన్ని వారికి వారి గురువుబోధించారు అని అర్థం.  అంటే, వారికి ఈ విషయం గురు శిష్య పరంపరగా బోధించబడింది అని అర్థం.)

          ఇది ఇలా ఉన్నందున (వేదోక్త కర్మలకూ మరియు దేవతా ఉపాసనలకూ వేర్వేరు ఫలితాలుంటాయని నిర్ణయమైనందున) –

             విద్యం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్o సహ |

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే ||  .. 11 ..

 

          దేవతా ఉపాసనలు మరియు వేదోక్త కర్మలు, ఈ రెండింటిని కలిపి తెలుసుకొన్నవాడు, కర్మల వల్ల మృతత్వాన్ని దాటి, ఉపాసనల వల్ల అమృతత్త్వాన్ని పొందుతాడు.

 

శంకర భాష్యమ్

విద్యాం చ అవిద్యాం చ దేవతాజ్ఞానం కర్మ చేత్యర్థః | యస్తత్ ఏతదుభయం సహ ఏకేన పురుషేణ అనుష్ఠేయం వేద తస్యైవం సముచ్చయకారిణ ఏకైకపురుషార్థసంబన్ధః క్రమేణ స్యాదిత్యుచ్యతే --- అవిద్యయా కర్మణా అగ్నిహోత్రాదినా మృత్యుమ్, స్వాభావికం కర్మ జ్ఞానం చ మృత్యుశబ్దవాచ్యమ్, తదుభయం తీర్త్వా అతిక్రమ్య విద్యయా దేవతాజ్ఞానేన అమృతం దేవతాత్మభావమ్ అశ్నుతే ప్రాప్నోతి | తద్ధ్యమృతముచ్యతే, యద్దేవతాత్మగమనమ్ ||

అధునా వ్యాకృతావ్యాకృతోపాసనయోః సముచ్చిచీషయా ప్రత్యేకం నిన్దోచ్యతే ---

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

విద్యామ్ చ అవిద్యామ్ చ– దేవతా విషయమైన జ్ఞానము మరియు వేదోక్త కర్మలతో కలసి; యః తత్ వేద ఉభయమ్ సహ – ఎవడు ఈ రెంటినీ కలిపి తెలుసుకొంటాడో, అవి రెండూ ఒకే పురుషునిచే అనుష్టింపతగినవని తెలుసుకొని ఆవిధంగా ఆ రెండింటినీ కలిపి ఆచరించిన వానికి మాత్రమే, వాటి వల్ల కలిగే పురుషార్థములు లేదా ఫలితములు క్రమముగా ఒకదాని తరువాత మరొకటిగా ప్రాప్తిస్తాయి.  ఈ విషయమే చెప్పబడబోతున్నది.

అవిద్యయా– అవిద్యచేత, అగ్నిహోత్రాది కర్మలచేత; ‘మృత్యుమ్ – మృత్యువునుండి, అనగా తన స్వభావంచే (జన్మాంతరకృత ధర్మాదిసంస్కారాః మరణకాలే అభివ్యక్తః స్వభావః ఉచ్యతే – భగవద్గీత శంకరభాష్యం 17.2; పూర్వజన్మలలో చేసిన పుణ్య పాప కర్మల సంస్కారములు మరణసమయంలో చిత్తములో అభివ్యక్తమవడాన్ని స్వభావం అంటారు.) ప్రేరేపింపబడిన కర్మలు మరియు దేవతా ఉపాసనలు మృత్యుశబ్దం చేత సూచింపబడటం చేత, ఆ రెండింటినీ; ‘తీర్త్వా– అధిగమించి; ‘విద్యయా– దేవతా ఉపాసన చేత, అమృతమ్ – మృతిలేని స్థితిని, దేవతలుగా పరిగణింపబడే స్థితిని—దేవత్వాన్ని పొందటమంటే మృతిలేకుండుట; ‘అశ్నుతే– పొందుతారు. 

(ఈ జన్మలో జీవుడు నిర్వహించే స్వాభావిక కర్మలు, ఉపాసనలు కూడా మృత్యు శబ్దంతో సూచింపబడుతున్నాయి. ఎందువల్లనంటే, కర్మ ఒక కాలంలో ప్రారంభమౌతుంది కొంత కాలం తర్వాతా ముగుస్తుంది.  ఉపాసనలు కూడా కాలంలో ప్రారంభమై కాలంలో అంతమౌతాయి. కనుక, కర్మలనూ ఉపాసనలనూ మృత్యు శబ్దంతో సూచించడం సమంజసమే. అగ్నిహోత్రాది కర్మాచరణం వల్ల, మృత్యుశబ్దంచే సూచింపబడే పూర్వజన్మలలో చేసిన పుణ్య పాప కర్మల సంస్కారాల వల్ల ఉత్పన్నమైన కర్మలు మరియు దేవతా ఉపాసనలను దాటిన ఉన్నత స్థితి, సాధకులకు కలుగుతుంది. అంటే, అవిద్య వల్ల అంటే వేదోక్త కర్మల వల్ల, కర్మలనుండి మరియు దేవతా ఉపాసనలనుండి తరిస్తారు లేదా వాటిని అధిగమిస్తారు. ఇక విద్య అంటే దేవతా ఉపాసనవల్ల అమృతత్వాన్ని లేదా దేవత్వాన్ని పొందుతారు.  ఇక్కడ అమృతత్వమంటే పరమాత్మను పొందుట కాదని గమనించాలి.)

ఇక, వ్యక్త దేవతా ఉపాసన మరియు అ వ్యక్త దేవతా ఉపాసనలు (గోచరమయ్యే మరియు గోచరంకాని దేవతా  ఉపాసన) అనే రెండింటియొక్క అనుసంధానాన్ని ప్రోత్సహిస్తూ, వాటిని విడివిడిగా ఆరాధించడాన్ని నిరసిస్తున్నారు.

అన్ధం తమః ప్రవిశన్తి యోఽసంభూతిముపాసతే |

తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్o రతాః ||  .. 12 ..

 

            ఎవరు అసంభూతిని (రూపములేని దానిని లేదా ప్రకృతిని) ఉపాసిస్తారో వారు అదర్శనాత్మకమైన చీకటిని ప్రవేశిస్తారు.  ఎవరు సంభూతిని (రూపం గల దానిని లేదా హిరణ్యగర్భుని) ఉపాసిస్తారో వారు అంత కంటే గాఢమైన చీకటిని (ప్రవేశిస్తారు).

 

శంకర భాష్యమ్

అన్ధం తమః ప్రవిశన్తి యే అసంభూతిమ్, సంభవనం సంభూతిః సా యస్య కార్యస్య సా సంభూతిః తస్యా అన్యా అసంభూతిః ప్రకృతిః కారణమ్ (అవిద్యా) అవ్యాకృతాఖ్యమ్, తామసంభూతిమవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణమవిద్యాం కామకర్మబీజభూతామ్ అదర్శనాత్మికామ్ ఉపాసతే యే తే తదనురూపమేవాన్ధం తమః అదర్శనాత్మకం ప్రవిశన్తి | తతః తస్మాదపి భూయో బహుతరమివ తమః తే ప్రవిశన్తి యే ఉ సంభూత్యాం కార్యబ్రహ్మణి హిరణ్యగర్భాఖ్యే రతాః ||

అధునా ఉభయోరుపాసనయోః సముచ్చయకారణ మవయవ ఫలభేదమాహ ---

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          అదర్శనాత్మకమైన చీకటిని ప్రవేశిస్తారు. యే – ఎవరు, ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో, వారు.  సంభూతి అంటే పుట్టుట లేదా ఉద్భవించుట లేదా ఏదైనా కార్యానికి ఫలితంగా (సంభవించుట) అని కూడా అర్థం.  ఆవిధంగా కానిది అసంభూతి (అంటే, కార్యకారణ సంబంధము మరియు పుట్టుక అనేవి లేనిది అని అర్థం). దీనినే ప్రకృతి (ప్రాథమిక తత్వం), కారణము, అవిద్య (అజ్ఞానము) లేదా అవ్యాకృతం (రూపునొందనిదని) అంటారు.  ఎవరు ఈ ప్రకృతి లేదా కారణము లేదా అవిద్యగా పిలువబడుతూ, కామ్యకర్మల బీజభూతమై అదర్శనాత్మక రూపమైన ఈ అసంభూతిని లేదా అవ్యాకృతమైన ఈ తత్వాన్ని ఉపాసిస్తారో, వారు దానికి అనురూపమైన అదర్శనాత్మకమైన చీకటిని ప్రవేశిస్తారు.   ఎవరు కార్యరూపాత్మకమైన బ్రహ్మను (సగుణ బ్రహ్మను) అనగా హిరణ్యగర్భునిగా పేర్కొనబడే సంభూతిని ఆరాధిస్తారో వారు, మరి అంతకంటే (ముందు వాక్యంలో వివరించబడిన అంధకారం కంటే మరింత) దట్టమైన చీకటిని ప్రవేశిస్తారు.

    ఇపుడు, ఈ క్రింది శ్లోకంలో, ఈ రెండు విధాలైన ఉపాసన అంగాలు ఇచ్చే ఫలాలలో తారతమ్యం, అందువలన వాటిని సముచ్చయము (అనుసంధానము) చేసుకోవలసిన అవసరాన్ని తెలియచేస్తున్నారు.

       

            అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ |      

ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే ||    .. 13 ..

సంభూతి (రూపం గల దానిని లేదా హిరణ్యగర్భుని) వలన భిన్నమైన (ఫలితం), అసంభూతి (రూపములేనిది లేదా ప్రకృతి) వలన వేరొక (ఫలితం) అన్న ధీమంతుల వచనాలను, మాకు వాటిగురించి వివరంగా బోధించిన ఆచార్యులు చెప్పగా, విన్నాం.

 

శంకర భాష్యమ్

అన్యదేవ పృథగేవ ఆహుః ఫలం సంభవాత్ సంభూతేః కార్యబ్రహ్మోపాసనాత్ అణిమాద్యైశ్వర్యలక్షణమ్ ఆఖ్యాతవన్త ఇత్యర్థః | తథా చ అన్యదాహురసంభవాత్ అసంభూతేః అవ్యాకృతాత్ అవ్యాకృతో పాసనాత్ యదుక్తమ్ ’ అన్ధం తమః ప్రవిశన్తి ’ ఇతి, ప్రకృతిలయ ఇతి చ పౌరాణికైరుచ్యతే | ఇతి ఏవం శుశ్రుమ ధిరాణాం వచనం యే నస్తద్విచచక్షిరే వ్యాకృతావ్యాకృతోపాసనఫలం వ్యాఖ్యాతవన్త ఇత్యర్థః ||

యత ఏవమ్, అతః సముచ్చయః సంభూత్యసంభూత్యుపాసన- యోర్యుక్తః ఏకైకపురుషార్థత్వాచ్చేత్యాహ ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

సంభవాత్’ - సంభూతి వలన; ‘అన్యత్ ఏవ - పూర్తిగా భిన్నమైన ఫలం; ఆహుః’ – చెప్పారు.  సగుణ బ్రహ్మోపాసన వల్ల లేదా  హిరణ్యగర్భుని ఉపాసన వల్ల (కార్యబ్రహ్మోపాసనాత్ అణిమాద్యైశ్వర్యలక్షణమ్) అణిమ, గరిమ మొదలైన లక్షణములు లభిస్తాయి.  ఆవిధంగానే, అసంభవాత్ - అసంభూతి వలన; అన్యత్ ఆహుః- భిన్నమైన ఫలం చెప్పారు, అంటే ప్రకృతి ఆరాధన వలన లేదా అవ్యాకృత తత్వాన్ని ఉపాసించుట వలన అన్ధం తమః ప్రవిశన్తి - అదర్శనాత్మకమైన చీకటిని ప్రవేశిస్తారు. దీనినే ప్రకృతిలయమని పౌరాణికులు చెప్తారు.  ఈ విధంగా ధీమంతుల (పండితుల) వచనాలను మేము ఆచార్యులైనవారు మాకు ఆ వ్యాకృత, అవ్యాకృత ఉపాసన ఫలాలను సవివరంగా బోధించగా విన్నాము.

(మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం చ మహేశ్వరమ్ తస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్ .. శ్వేతాశ్వతరోపనిషత్ (4-10). ఈ ఉపనిషత్ వాక్యంనుండి మాయ చైతన్యంపైన ఆధారభూతమైనదని, పరమాత్మ వశమై వర్తిస్తుందని గ్రహించవచ్చు.) (మార్పునొందని పరమాత్మ వేరొక తత్వంగా రూపొందుట అసంభవమైనందున, ఇచట అవ్యాకృతమని చెప్పబడినది మాయయే గాని పరమాత్మ కాదని గ్రహించాలి – ఆనందగిరి టీక)

ఈ విధంగా చెప్పబడినందున, సాధింపగోరే పురుషార్థము ఒకటే అయినందువల్ల, ఇప్పుడు సంభూతి, అసంభూతి ఉపాసనలను అనుసంధానించుకొనడమే యుక్తమని చెప్పబడుతోంది.


సంభూతిం చ  వినాశం చ యస్తద్వేదోభయగ్o సహ |

వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాఽమృతమశ్నుతే ||  .. 14 ..

 

 సగుణ బ్రహ్మోపాసన, అవ్యాకృతమైన ప్రకృతి ఆరాధనను ఈ రెండింటిని కలిపి తెలుసుకొన్నవాడు, అవ్యాకృతమైన ప్రకృతి ఆరాధన వల్ల మృతత్వాన్ని దాటి, సగుణ బ్రహ్మోపాసన వల్ల అమృతత్త్వాన్ని పొందుతాడు.

 

శంకర భాష్యమ్

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ, వినాశేన, వినాశో ధర్మో యస్య కార్యస్య స తేన ధర్మిణా అభేదేనోచ్యతే ’ వినాశః ’ ఇతి | తేన తదుపాసనేన అనైశ్వర్యమధర్మకామాదిదోషజాతం చ మృత్యుం తీర్త్వా, హిరణ్యగర్భోపాసనేన హ్యణిమాదిప్రాప్తిః ఫలమ్, తేనానైశ్వర్యాది మృత్యుమతీత్య, అసంభూత్యా అవ్యాకృతోపాసనయా అమృతం ప్రకృతిలయలక్షణమ్ అశ్నుతే | ‘సంభూతిం చ వినాశం చ’ ఇత్యత్రావర్ణలోపేన నిర్దేశో ద్రష్టవ్యః, ప్రకృతిలయఫలశ్రుత్యనురోధాత్ ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ - సగుణ బ్రహ్మోపాసన, అవ్యాకృతమైన ప్రకృతి ఆరాధనలను రెండింటిని అనుసంధానించు కొన్న సందర్భంలో, వినాశేన – ఏ కార్యానికి వినాశము (మార్పుచెందుట లేదా నశించుట) ధర్మమౌతుందో, అట్టి ధర్మంకలదానినే (అంటే ధర్మినే) వినాశము అంటారు. (మార్పుచెందుట లేదా నశించుట సగుణ బ్రహ్మ ధర్మము.  అట్టి ధర్మము గలిగిన సగుణ బ్రహ్మ తత్వము వినాశ శబ్దముచే సూచితము).  అట్టి సగుణబ్రహ్మోపాసన వలన అనైశ్వర్యము, అధర్మము, కామము వంటి దోషములచే జనించిన మృత్యువును అధిగమించి, అనగా  హిరణ్యగర్భుని ఉపాసన వలన అణిమ, గరిమ మొదలైనవి ఫలములని చెప్పబడినందున, ఆ పొందబడే ఫలములచేత మృత్యువును అధిగమించి, అసంభూత్యా - అవ్యాకృతమైన ప్రకృతి ఉపాసనచే, అమృతం – ప్రకృతిలయమే లక్షణంగా గలిగిన ఫలాన్ని, అశ్నుతే – పొందుతారు.సంభూతిం చ వినాశం చ’ అన్న వాక్యంలో శ్రుతి అసంభూతి ఉపాసనకు ప్రకృతి లయము ఫలమని చెప్పిన విషయానికి అనుగుణంగా ఇచట వర్ణ లోపము జరిగినదని గుర్తించాలని నిర్దేశింపబడుతోంది. (శ్రుతి వాక్యానికి అనుగుణంగా ఈ శ్లోక భాగంలో సంభూతిం పదానికి ముందు వర్ణాన్ని చేర్చుకొని అసంభూతిం గా చదువుకోవాలని సూచిస్తున్నారు.)

 

శంకర భాష్యమ్

మానుషదైవవిత్తసాధ్యం ఫలం శాస్త్రలక్షణం ప్రకృతిలయాన్తమ్; ఏతావతీ సంసారగతిః | అతః పరం పూర్వోక్తమ్ ’ ఆత్మైవాభూద్విజానతః ’ ఇతి సర్వాత్మభావ ఏవ సర్వైషణాసంన్యాసజ్ఞాననిష్ఠాఫలమ్ | ఏవం ద్విప్రకారః ప్రవృత్తినివృత్తిలక్షణో వేదార్థాఽత్ర ప్రకాశితః | తత్ర ప్రవృత్తిలక్షణస్య వేదార్థస్య విధిప్రతిషేధలక్షణస్య కృత్స్నస్య ప్రకాశనే ప్రవర్గ్యాన్తం బ్రాహ్మణముపయుక్తమ్ | నివృత్తిలక్షణస్య (వేదార్థస్య) ప్రకాశనే అత ఊర్ధ్వం బృహదారణ్యకమ్ | తత్ర నిషేకాదిశ్మశానాన్తం కర్మ కుర్వన్ జిజీవిషేద్యో విద్యయా సహాపరబ్రహ్మవిషయయా, తదుక్తమ్ ---  విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయంసహ | అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే ’ ఇతి, తత్ర సోఽధికారి కేన మార్గేణామృతత్వమశ్నుతే ఇత్యుచ్యతే --- తద్యత్తత్సత్యమసౌ స ఆదిత్యో య ఏష ఏతస్మిన్మణ్డలే పురుషో యశ్చాయం దక్షిణోఽక్షన్పురుషః ఏతదుభయం సత్యం బ్రహ్మోపాసీనః యథోక్తకర్మకృచ్చ యః, సోఽన్తకాలే ప్రాప్తే సత్యాత్మానమాత్మనః ప్రాప్తిద్వారం యాచతే ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

శాస్త్ర ప్రకారం ప్రకృతిలయమే మానుష విత్తం (అనగా గో, భూ, హిరణ్యములను మానుష విత్తము లంటారు) మరియు దైవ విత్తం (దేవతా విషయకమైన జ్ఞానం) లచే సాధింపగల అంతిమ (ఉత్తమమైన) ఫలం.  ఇంతవరకు ఇది సంసారగతి.  అన్ని కోరికలను సంన్యసించిన జ్ఞాననిష్ఠులకు ఇంతకు ముందు ఆత్మైవాభూద్విజానతః’ మంత్రములో చెప్పినట్లుగా సర్వమూ ఆత్మయేననే భావమే ఫలము.  ఈ విధంగా  ప్రవృత్తి, నివృత్తి లక్షణాలనే రెండు విధములు వేదార్థమునందు ప్రకాశితమౌతున్నవి.  ప్రవృత్తి లక్షణము గురించి వేదార్థము నందు విధిప్రతిషేధలక్షణమైన (శతపథ) బ్రాహ్మణములోని ప్రవర్గ్య కర్మతో అంతమయ్యే భాగము వరకు ఉపయోగకరము.  నివృత్తి లక్షణము గురించి వేదార్థము నందు ఆ తరువాతి భాగమైన బృహదారణ్యకము ఉపయుక్తము.  అచట, నిషేకముతో మొదలై శ్మశానముతో అంతమయ్యే కర్మలను నిర్వర్తిస్తూ, దేవతా విషయకమైన జ్ఞానముతో సహా జీవింపదలచే వారి గురించి విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయంసహ | అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే’ (అగ్నిహోత్రాది కర్మలచేత మృత్యువును, దేవతా జ్ఞానము చేత ఉపాసించే దేవతే ఆత్మ అనే భావాన్ని పొందుతారు)  అని చెప్పబడింది.  అట్టివారు ఏ మార్గంలో అమృతత్వాన్ని పొందుతారు అనే విషయమై తదుపరి చెప్పబడుతోంది.తద్యత్తత్సత్యమసౌ స ఆదిత్యః య ఏష ఏతస్మిన్మణ్డలే పురుషో యశ్చాయం దక్షిణోఽక్షన్పురుషః’ (బృహదారణ్యక 5.5.2).  ఆదిత్యమండలంలో చరించే పురుషుడు మరియు కుడి నేత్రము లోని పురుషుడు ఈ ఇద్దరినీ ఎవరైతే సత్యముగా బ్రహ్మముగా ధ్యానిస్తారో మరియు, వేదవిహిత కర్మాచరణులో, వారు అంత్యకాలంలో ఆ సత్యమైన పరబ్రహ్మాన్ని ఆత్మను పొందే ద్వారం కొరకు ఇలా ప్రార్థిస్తారు.

(వేద విహిత కర్మలందు మాత్రమే నిష్ఠ కలిగిన వారి దృష్టిలో తాము ఆత్మయే అనే భావమే స్ఫురించదు.  అటువంటి వారినే ఆత్మహనులని అంటారని 3వ మంత్రంలో చెప్పారుకదా.  ఈ జగత్తు సర్వమూ ఈశ్వరునిచే ఆవరించబడినదనే సత్యాన్ని గ్రహించిన ఆత్మజ్ఞాన నిష్ఠులకు ఇక చేయవలసిన కర్మయే లేనందున వారికి కర్మలందు ఆసక్తి ఉండదు.  ఆ విధంగా ఆత్మగురించిన జ్ఞానములేని వారికి కర్మలు, దేవతా ఉపాసనలు విధించబడ్డాయి. అలాంటి కర్మిష్ఠులు పొందే అత్యున్నతమైన ఫలం మాయ లేదా ప్రకృతిలో లయం కావడం మాత్రమే అని 14వ మంత్రం చెప్పబడింది కదా.   అటువంటి వారు సత్యం లేదా పరబ్రహ్మ అనేది తమకు అన్యమైన వేరొక తత్త్వంగా భావిస్తారు.  తమకు భిన్నమైన పరబ్రహ్మను పొందుటే జీవిత పరమార్థమన్న సత్యాన్ని గ్రహించిన వారై, తమకు అన్యమైన ఆ పరబ్రహ్మను లేదా ఆ సత్యాన్ని ఆదిత్యమండలంలో ఉండే పురుషుడిగానో లేదా తమ దక్షిణ నేత్రంలో ఉండే పురుషుడిగానో భావనచేస్తారు.  అందుచేతనే, కర్మానుష్ఠాన పరులు మరణానంతరం కానరాని చీకటిచే నిండిఉండే అసుర్యములనే లోకాలవైపు పయనిస్తారని 3వ మంత్రంలో చెప్పారు.  కాబట్టి, మరణ సమయంలో వారు సత్యం లేదా పరమమైన ఆ స్థానాన్ని పొందగోరి దానిని చేరేందుకు మార్గానికై ఏవిధంగా ప్రార్థిస్తారో తరువాతి మంత్రంలో చెపుతున్నారు.)      


హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ |

తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ||  .. 15 ..

 

          సత్యం యొక్క ముఖం (ఆదిత్యాంతర్గమైన బ్రహ్మము యొక్క స్వరూపం) బంగరు పాత్రచే దాచబడింది. హే పూషా, సత్యమే ధర్మంగాగల నేను (వేదోక్త కర్మలు నిర్వహించిన వాడినైనందున) దర్శించేందుకై,  దానిని (ఆ బంగరు పాత్రని) నీవు తొలగించు.

 

శంకర భాష్యమ్

హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయమివ హిరణ్మయమ్, జ్యోతిర్మయమిత్యేతత్, తేన పాత్రేణేవ అపిధానభూతేన సత్యస్య (ఏవ) ఆదిత్యమణ్డలస్థస్య బ్రహ్మణః అపిహితమ్ ఆచ్ఛాదితం ముఖం ద్వారమ్; తత్, త్వం హే పూషన్, అపావృణు అపసారయ సత్యధర్మాయ తవ సత్యస్యోపాసనాత్సత్యం ధర్మో యస్య మమ సోహం సత్యధర్మా తస్మై మహ్యమ్; అథవా, యథాభూతస్య ధర్మస్యానుష్ఠాత్రే, దృష్టయే తవ సత్యాత్మన ఉపలబ్ధయే ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          సత్యస్య – ఆదిత్యమండలములోనున్న పరబ్రహ్మయొక్క; ‘ముఖమ్’ – ద్వారము; హిరణ్మయ’ - సువర్ణమయము లేదా అంతా జ్యోతిర్మయమైన, బంగారుమయమైన; ‘పాత్రేణ -  పాత్రచే, అనగా పైమూత వలె యున్నటువంటిదానిచే; ‘అపిహితమ్’ – మరుగు పడుతోంది (దర్శనీయం కావడం లేదు); తత్’ - ఆవిధంగా ఆదిత్యమండలాంతర్గతమైన బ్రహ్మయొక్క ముఖమును మరుగుపరచుచూ ఉన్న సువర్ణమయమైన పాత్రవలెయున్న జ్యోతిర్మయమైన ప్రకాశాన్ని, పూషన్’ – ఓ పూషా; ‘త్వం– నీవు; ‘సత్యధర్మాయ – సత్యబ్రహ్మోపాసనము వలన ఆసత్యమే నాధర్మముగా గల వాడినైనందున నేను సత్యధర్ముడను అనగా సత్యమే నా ధర్మమైనట్టి నా కొరకై లేదా విధి విధానముగా కర్మలను అనుష్టించినట్టి నా యొక్క; దృష్టయే – దర్శనార్థమై, అపావృణు’ - అపసరించు (తొలగించు లేదా ఉపసంహరించు); తద్వారా నేను నీ సత్యాత్మను  పొందగలను.

          (జీవిత పర్యంతం వేదవిహిత కర్మానుష్ఠానం వల్ల ఉపాసనల వల్ల కలిగే అత్యంత ఉన్నతమైన ఫలం మాయ లేదా ప్రకృతిలో విలీనం కావడం.  తానే పరబ్రహ్మంగా ఎరుకకలిగిన జ్ఞాని స్థితికి, ఈ ప్రకృతిలో లయ మయ్యే స్థితికి గల తేడా ప్రస్ఫుటంగా కనబడుతోంది.  ప్రకృతిలో లీనమైన కర్మసాధకులకు తాము జీవులము లేదా బ్రహ్మకు భిన్నమనే భావం మిగిలే ఉంటుంది.  ప్రకృతిలో లయమైన తాము దానినే సత్యంగా భావించినప్పటికీ, తమకు అన్యమైన సత్యం వేరొకటి ఆదిత్యమండలంలోని పురుషుడుగా ఉన్నదనే భావన చేస్తున్నాడు.   అలా ఆ అన్యమైన ఆ సత్యం ఆదిత్యుని తేజస్సువల్ల దాచి ఉంచబడినందున దానిని దర్శించేందుకై, తన తేజో కిరణాలు ఉపసంహరించి అనుగ్రహించమని సూర్యుణ్ణి ప్రార్థిస్తున్నాడు.  ఈ ప్రార్థన తరువాతి మంత్రంలో కూడా కొనసాగుతోంది.) 

 

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య

                        వ్యూహ రశ్మీన్ సమూహ తేజః |

యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి

                        యోఽసావసౌ పురుషః సోహమస్మి  || .. 16 ..

 

ఓ జగత్పోషకా, ఒంటరి బాటసారీ, సర్వ నియంతకా సూర్యా, ప్రజాపతి తనయుడా, నీ కిరణాలను ఏకీకృతం చేయి (ఉపసంహరించు).  కళ్యాదప్రదమైన నీ రూపాన్ని దర్శించేలా అనుగ్రహించు. ఆ వ్యాకృత పురుషుడను నేనే.

 

శంకర భాష్యమ్

హే పూషన్ జగతః పోషణాత్పూషా రవిః | తథా ఏక ఏవ ఋషతి గచ్ఛతీత్యేకర్షిః హే ఏకర్షే | తథా సర్వస్య సంయమనాద్యమః హే యమ | తథా రశ్మీనాం ప్రాణానాం రసానాం చ స్వీకరణాత్సూర్యః హే సూర్య | ప్రజాపతేరపత్యం ప్రాజాపత్యః హే ప్రాజాపత్య | వ్యూహ విగమయ రశ్మీన్ స్వాన్ | సమూహ ఏకీకురు ఉపసంహర (తే) తేజః తావకం (తాపకం) జ్యోతిః | యత్ తే తవ రూపం కల్యాణతమమ్ అత్యన్తశోభనమ్, తత్ తే తవాత్మనః ప్రసాదాత్ పశ్యామి | కించ, అహం న తు త్వాం భృత్యవద్యాచే యోఽసౌ ఆదిత్యమణ్డలస్థః అసౌ వ్యాహృత్యవయవః పురుషః పురుషాకారత్వాత్, పూర్ణం వాఽనేన ప్రాణబుద్ధ్యాత్మనా జగత్సమస్తమితి పురుషః పురి శయనాద్వా పురుషః | సోహమ్ అస్మి భవామి ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

            హే పూషన్ జగత్తును పోషించువాడైనందున రవిని పూషా అని సంబోధిస్తారు. అదేవిధంగా ఏక ఏవ ఒంటరిగానే ఋషతి గమించుటచే ఏకర్షి అందుచే హే ఏకర్షే. అలాగే సర్వాన్ని సంయమించే (నియంత్రించే) వాడైనందున యమ హే యమ. అలాగే కిరణాలను, ప్రాణాలను, ఉదకాలను స్వీకరించేవాడైనందున సూర్యుడు, హే సూర్య. ప్రజాపతి కుమారుడైనందున ప్రాజాపత్యుడు, హే ప్రాజాపత్య, వ్యూహ– తొలగించు, ‘రశ్మీన్ - కిరణాలను, సమూహ- ప్రోదిచేయు లేదా ఉపసంహరించు, తేజః- వెలుగుయొక్క తేజస్సును లేదా వేడిమిని, యత్ తే అట్టి (పై విధంగా కిరణ తేజములు ఉపసంహరించిన తదుపరి మిగిలినట్టి) నీ రూపము మంగళకరము, అత్యంత శోభాయమానము, తత్ తే- అట్టిదానిని నీ అనుగ్రహముచేత, దర్శించేందుకై.  అయితే, నీ సేవకునిగా లేదా దాసునిగా పొందే అనుగ్రహంగా కాదు. యః అసౌ (యోఽసౌ) ఆదిత్యమండలస్థ ఆదిత్యమండలంలో, వ్యాహృతులే అవయవములుగా కలిగి, పురుషాకారమైయున్నందున లేదా ప్రాణ బుద్ధుల రూపంగా జగత్తు సమస్తాన్ని పూర్ణంగా నిండియున్నందున మరి లేదా పురములో శయనించియున్నందున, పురుషునిగా పిలవబడుతూన్నట్టి వాడను సః అహమ్ అస్మి నేనే అయి ఉన్నాను.

          ( ఇంతకు ముందు చెప్పిన మంత్రంలోని ప్రార్థనే ఈ మంత్రంలో కూడా కొనసాగుతోంది.  సత్యం యొక్క ముఖ ద్వారం హిరణ్మయ పాత్రచే దాచి ఉంచబడింది.  కాబట్టి, జగత్పోషకుడైన ఆదిత్యుడిని సత్యదర్శనానికి అడ్డుగా ఉన్నట్టి ఆ హిరణ్మయమైన పాత్రను తొలిగించమని ముందటి మంత్రంలో ప్రార్థించాడు.  తరువాతి మంత్రంలో, సూర్యుడిని మరిన్ని విశేషణాలతో కీర్తిస్తూ ఇలా అంటున్నాడు.  ఓ పోషకా నీ తేజో పుంజాలన్నింటినీ ఉపసంహరించు.  అలా నా మీద గల దయతో, నీ సత్య స్వరూపాన్ని మరుగు పరచే తేజాన్ని తొలగించినపుడే నీ మంగళకరమైన రూపాన్ని నేను దర్శించగలను. ఆ దర్శనం ఎలాంటిదంటే, ఆ సత్య స్వరూపమే నేననే భావనతో దర్శిస్తాను.  ఉపాసన వల్ల సాధకుడు పొందే అత్యున్నతమైన ఫలం అదే.  దేనిని ఉపాసిస్తాడో తాను చివరకు అదే అయిపోతాడు.  అయినప్పటికీ అతనిలో కోరికలు అంతం కాలేదు.  కోరికలు సమూలంగా నశించలేదు అంటే సంసారం మిగిలే ఉంటుంది.  అజ్ఞానం తొలగిపోదు.  ఈ విషయాన్నే అంటే కర్మలు, ఉపాసనల వల్ల పొందిన అత్యున్నత ఫలితాన్ని పొందిన తరువాత కూడా ఆ సాధకునిలో ఏ విధమైన కోరికలు మిగిలి ఉంటాయో తరువాతి మంత్రాలలో విశదపరుస్తున్నారు.)


                   వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్o శరీరమ్ |

      ఓం క్రతో స్మర కృతగ్o స్మర క్రతో స్మర కృతగ్o స్మర ||  .. 17 ..

 

            ప్రాణము మృతత్వం లేని (సర్వగతమైన) వాయువులో లయం చెందనీ.  శరీరం భస్మంగా మిగలనీ.  ఓం.  మనసా స్మరించు. చేసిన కర్మలను స్మరించు.  మనసా స్మరించు. చేసిన కర్మలను స్మరించు.

 

శంకర భాష్యమ్

అథేదానీం మమ మరిష్యతో వాయుః ప్రాణః అధ్యాత్మపరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకమ్ అనిలమ్ అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతామితి వాక్యశేషః | లింగం చేదం జ్ఞానకర్మసంస్కృతముత్క్రామత్వితి ద్రష్టవ్యమ్, మార్గయాచనసామర్థ్యాత్ | అథ ఇదం శరీరమగ్నౌ హుతం భస్మాన్తం భస్మావశేషం భూయాత్ | ఓమితి యథోపాసనమ్ ఓంప్రతీకాత్మకత్వాత్సత్యాత్మకమగ్న్యాఖ్యం బ్రహ్మాభేదేనోచ్యతే | హే క్రతో సంకల్పాత్మక స్మరయన్మమ స్మర్తవ్యం తస్య కాలోఽయం ప్రత్యుపస్థితః, అతః స్మర ఏతావన్తం కాలం భావతిం కృతమ్ అగ్నే స్మర యన్మయా బాల్యప్రభృత్యనుష్ఠితం కర్మ తచ్చ స్మర | క్రతో స్మర కృతం స్మర ఇతి పునర్వచనమాదరార్థమ్ ||

పునరన్యేన మన్త్రేణ మార్గం యాచతే ---

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          ఇపుడు, మరణమాసన్నమైనందున, ప్రాణరూపముగా ఆత్మసంబంధముగా నున్న వాయువు వీడి, సర్వత్రా నిండియున అమృతరూపమైన అనిలముగా, సూత్రాత్మతను (హిరణ్యగర్భుని) పొందుతుంది  ఇది వాక్యశేషం.  మార్గాన్ని యాచించే సామర్థ్యము కలిగియున్నందున, కర్మానుష్ఠానము వల్లను ఉపాసనల వల్లను పునీతమైన లింగ శరీరము ఉన్నత స్థితిని పొందగలదని కూడా చూపబడుతోంది.  ఇపుడు ఈ స్థూల శరీరము అగ్నిలో ఆహుతిచేయబడి భస్మముగా మిగిలిపోతుంది.  ఓం.  ఉపాసనవిధానముననుసరించి ఓంకారము ప్రతీకగాగల తత్వమునకును, సత్యాత్మకమై, అగ్నిగా వ్యాఖ్యానించబడే బ్రహ్మమునకును, భేదము లేదని చెప్తారు.  హే క్రతుః. సంకల్పరూపమైయున్న తత్వమా!  నేను స్మరిందగినది ఏది కలదో దానిని స్మరింపదగిన కాలము ఆసన్నమైనది. స్మరింపుము.  ఇప్పటివరకు ఏది భావన చేశానో, హే అగ్నే, దానిని స్మరింపుము. బాల్యావస్థనుండి నే చేసిన కర్మానుష్ఠానాన్ని స్మరింపుము. క్రతో స్మర కృతం స్మర -  మరలా, మరలా చెప్పడం ఆర్తిని సూచిస్తోంది. 

 

          (కర్మలను ఉపాసనలను వేదవిహిత విధానంలో ఆచరించిన సాధకుడు, అత్యున్నతమైన ఫలితాన్ని పొందిన తరువాత కూడా, సంకల్ప రూపమైయున్న మనసును ఇలా కోరుతున్నాడు. మరణానంతరం ప్రాణం సూత్రాత్మలో విలీనమౌతుంది.  శరీరం భస్మంగా మిగులుతుంది.  ఇక మిగిలేది మనసు ఒక్కటే.  కాబట్టి, సంకల్పాలకు ప్రతీకయైన మనసును జీవించిన కాలంలో తాను చేసిన కర్మలను స్మరించమని ఆర్తిగా మరల మరల కోరుతున్నాడు.  ఎందుకంటే,  ఆ కర్మల ఫలాలను అనుభవించాలనే తపన అతనిలో మిగిలే ఉంది.  అంతేకాదు,  అతనిలో మిగిలిన ఇతర అభీష్టాలను ఇంకా వివరిస్తున్నారు.

                    అగ్నే నయ సుపథా రాయే

        అస్మాన్విశ్వాని దేవ వయునాని విద్వాన్ |

        యుయోధ్యస్మజ్జుహురాణమేనో

        భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ||  .. 18 ..

 

            ఓ అగ్నీ, మేము నిర్వర్తించిన కర్మలు తెలిసిన వాడవైనందున, ఆ కర్మ ఫలాలను మేము అనుభవించేలా, ఉత్తమమార్గంలో తీసుకెళ్ళు. చేయబడిన సమస్త దోషాలను తొలగించు.  నీకు అనేక నమస్కారములు చెప్తున్నాం.

 

శంకర భాష్యమ్

హే అగ్నే నయ గమయ సుపథా శోభనేన మార్గేణ | సుపథేతి విశేషణం దక్షిణమార్గనివృత్త్యర్థమ్ | నిర్విణ్ణోహం దక్షిణేన మార్గేణ గతాగతలక్షణేన; అతో యాచే త్వాం పునః పునః గమనాగమనవర్జితేన శోభనేన పథా నయ | రాయే ధనాయ, కర్మఫలభోగాయేత్యర్థః | అస్మాన్ యథోక్తధర్మఫలవిశిష్టాన్ విశ్వాని సర్వాణి హే దేవ వయునాని కర్మాణి, ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్ | కించ, యుయోధి వియోజయ వినాశయ అస్మత్ అస్మత్తః జుహురాణం కుటిలం వంచనాత్మకమ్ ఏనః పాపమ్ | తతో వయం విశుద్ధాః సన్తః ఇష్టం ప్రాప్స్యామ ఇత్యభిప్రాయః | కింతు వయమిదానీం తే న శక్నుమః పరిచర్యాం కర్తుమ్; భూయిష్ఠాం బహుతరాం తే తుభ్యం నమ ఉక్తిం నమస్కారవచనం విధేమ నమస్కారేణ పరిచరేమ్ ఇత్యర్థః ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

          హే అగ్నే, నయ గమించు (బయలుదేరు), సుపథా – శుభకరమైన మార్గాన. సుపథ అని విశేషణం చెప్పడం వల్లన దక్షిణ మార్గ ప్రయాణాన్ని నివారించడం అని అర్థం. దక్షిణ మార్గంలో వచ్చుట, పోవుట అనే లక్షణములున్నందున నిర్విణ్ణుడనయితిని (నిరాశ చెందితిని).  అందుచే, రాకడలు పోకడలు లేని శుభకరమైన మార్గాన తీసుకువెళ్ళమని మరీ మరీ నిన్ను యాచిస్తున్నాను.  రాయే అనగా ధనము చేత లేదా కర్మఫలభోగము చేత.  హే దేవ (ఓ అగ్నీ), యథోక్తముగా ఆచరించిన కర్మఫల శేషములమైన మమ్ము, జగత్తులో సర్వములైన కర్మలను, ఉపాసనలను నీవెరుగుదువు.  అంతేకాక, యుయోధి అనగా వియోజయము లేదా వినాశము చేయుము (నశింపచేయు లేదా దూరముచేయు), అస్మత్ మానుండి, జుహురాణం కుటిలమైన, వంచనతోకూడిన,  ఏనః పాపములను.  అందువలన, మేము విశుద్ధులమై మా అభీష్టములను పొందెదమని అభిప్రాయము. కాని, మేము ఈ పరిస్థితిలో (మరణ సమయంలో) నీకు పరిచర్యలు చేయుటకు అశక్తులము.  భూయిష్ఠాం బహుమార్లు, తే’ - నీకు నమ ఉక్తిం’ - నమస్కృతులు చెప్తున్నాము, విధేమ’ - నమస్కారములతో పరిచర్యచేస్తున్నామని అర్థం.

            ( సాధకుడు అగ్నిని ఇలా ప్రార్థిస్తున్నాడు.  ఓ అగ్నీ, జీవితకాలంలో నేను చేసిన సర్వ కర్మలు, ఉపాసనలూ నీకెరుకే.  కాబట్టి, వాటి ఫలాలు పొందేలా నన్ను సుగమమైన ఉత్తమమైన మార్గాన తీసుకెళ్ళు.  న్యూనతమైన దక్షిణమార్గంలో కాదు.  ఎందుకంటే, దక్షిణమార్గంలో వెళ్ళినవారు పుట్టుక, చావు అనే ఆవృత్తిలో తిరుగాడుతుంటారు.  గతంలో ఆ మార్గాన వెళ్ళి నిరాశచెంది ఉన్నాను.  కాబట్టి,  అట్టి మార్గంలో కాకుండా ఉన్నతమైన మార్గంలో నన్ను తీసుకెళ్ళు.  ఎందుకంటే, నే చేసిన వేదవిహిత కర్మల ఫలాలు అనుభవించాల్సి ఉంది.  ఇంకా ఏమంటే, కుటిల బుద్ధితో వంచనతో నే చేసిన పాపాలు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయి.  అవి నాశనం కాకుంటే పుణ్యఫలాల అనుభవానికి అవి ఆటంకాలవుతాయి.  ఇలా అగ్నికి అనేక నమస్కారాలు తెలియచేస్తున్నాడు సాధకుడు.) 

 

శంకర భాష్యమ్

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే’, ‘వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్యాఽమృతమశ్నుతే’ ఇతి శ్రుత్వా కేచిత్సంశయం కుర్వన్తి | అతస్తన్నిరాకరణార్థం సంక్షేపతో విచారణాం కరిష్యామః | తత్ర తావత్కింనిమిత్తః సంశయ ఇతి, ఉచ్యతే --- విద్యాశబ్దేన ముఖ్యా పరమాత్మవిద్యైవ కస్మాన్న గృహ్యతే, అమృతత్వం చ? ననూక్తాయాః పరమాత్మవిద్యాయాః కర్మణశ్చ విరోధాత్సముచ్చయానుపపత్తిః | సత్యమ్ | విరోధస్తు నావగమ్యతే, విరోధావిరోధయోః శాస్త్రప్రమాణకత్వాత్; యథా అవిద్యానుష్ఠానం విద్యోపాసనం న (చ) శాస్త్రప్రమాణకమ్, తథా తద్విరోధావిరోధావపి | యథా చ న హింస్యాత్సర్వా భూతాని  ఇతి శాస్త్రాదవగతం పునః శాస్త్రేణైవ బాధ్యతే అధ్వరే పశుం హింస్యాత్’ ఇతి, ఏవం విద్యావిద్యయోరపి స్యాత్; విద్యాకర్మణోశ్చ సముచ్చయః | ; ‘దూరమేతే విపరీతే విషూచీ అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా’ ఇతి శ్రుతేః | ‘విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ’ ఇతి వచనాదవిరోధ ఇతి చేత్, ; హేతుస్వరూపఫలవిరోధాత్ | విద్యావిద్యా విరోధావిరోధయోర్వికల్పాసంభవాత్ సముచ్చయవిధానాదవిరోధ ఏవేతి చేత్, ; సహసంభవానుపపత్తేః |

క్రమేణైకాశ్రయే స్యాతాం విద్యావిద్యే ఇతి చేత్, ; విద్యోత్పత్తౌ (అవిద్యాయా హ్యస్తత్వాత్) తదాశ్రయేఽవిద్యానుపపత్తేః; న హి అగ్నిరుష్ణః ప్రకాశశ్చ ఇతి విజ్ఞానోత్పత్తౌ యస్మిన్నాశ్రయే తదుత్పన్నమ్, తస్మిన్నేవాశ్రయే శీతోఽ గ్నిరప్రకాశో వా ఇత్యవిద్యాయా ఉత్పత్తిః | నాపి సంశయః అజ్ఞానం వా, ‘యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః | తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః’ ఇతి శోకమోహాద్యసంభవశ్రుతేః | అవిద్యాసంభవాత్తదుపాదానస్య కర్మణోఽప్యనుపపత్తిమవోచామ | ‘అమృతమశ్నుతే’ ఇత్యాపేక్షికమమృతమ్; విద్యాశబ్దేన పరమాత్మవిద్యాగ్రహణేహిరణ్మయేన ఇత్యాదినా ద్వారమార్గయాచనమనుపపన్నం స్యాత్ | తస్మాత్ యథావ్యాఖ్యాత్ (ఉపాసనయా సముచ్చయో న పరమాత్మవిజ్ఞానేనేతి యథాస్మాభిర్వ్యాఖ్యాత) ఏవ మన్త్రాణామర్థ ఇత్యుపరమ్యతే ||

 

శంకరుల భాష్యానికి తెలుగు అనువాదం

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే’, ‘వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్యామృతమశ్నుతే’ ఈ శృతి వాక్యాలు విన్నవారికి సందేహం కలుగుతుంది.  ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కొరకు సంక్షిప్తంగా విచారణ చేస్తున్నాము.  దేని కారణంగా ఈ సందేహమేర్పడిందో చెప్పబడుతోంది .. 

సందేహం:

విద్య శబ్దమునకు అలాగే అమృతము శబ్దమునకు అర్థము ముఖ్యమైన పరమాత్మజ్ఞానమేనని ఎందువలన గ్రహింపబడుటలేదు?

సమాధానం:

పరమాత్మజ్ఞానానికి కర్మలతో విరుద్ధత కలదని, సముచ్చము పొసగదని ముందు చెప్పబడినది. (అందువలన, ఈ శ్లోకంలోని విద్య శబ్దమునకు పరమాత్మజ్ఞానము అనే అర్థము సరిపడదు.)

సందేహం:

ఇది నిజమే.  కాని, జ్ఞానమునకు వేదవిహిత కర్మలకు విరోధము అవగతము కావడంలేదు.  ఎందువలనంటే విరోధము లేదా అవిరోధమునకు శృతి ప్రమాణము ఆవశ్యకము. కర్మానుష్ఠానము మరియు జ్ఞాననిష్ఠ వేదవిహితమైనట్లుగనే, వాటి విరోధము లేదా అవిరోధముకూడా శృతిబద్ధమై ఉండాలి.  ఏవిధంగానైతే, న హింస్యాత్సర్వా భూతాని అని శాస్త్రముచే అవగతమైన విషయమే అధ్వరే పశుం హింస్యాత్’ అని అదే శాస్త్రముచే వేరొక సందర్భంలో వ్యతిరేకింపబడుతోందో, అదేవిధంగా జ్ఞాన కర్మల సముచ్చమునకు అవిరుద్ధత ఉండే అవకాశము ఉన్నది కదా.

సమాధానం:

          కాదు. దూరమేతే విపరీతే విషూచీ అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా’ (కఠోపనిషత్ 1.2.4) అనే శృతి వాక్యం ప్రకారం విద్య మరియు అవిద్య పూర్తిగా భిన్నమైనవి, వాటి మార్గాలు విరుద్ధములు.

సందేహం:

          మరి, విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ’ (ఈశావాస్యోపనిషత్ 1.11) అని కూడా శృతి వాక్యం ప్రకారం వాటికి వైరుధ్యము లేదని చెప్పబడుతోంది కదా.   

సమాధానం:

        కాదు. వాటి (పరమాత్మ జ్ఞానమునకు మరియు వేదవిహిత కర్మలకు) కారణము, స్వరూపము, ఫలములయందు వైరుధ్యమున్నది. (కర్మకు హేతువు వేద విహిత, నిషిద్ధ వాక్యములు.  పరమాత్మ జ్ఞానానికి హేతువు కేవల వస్తు విషయమైన బోధ.  అందుచేత, కర్మకూ పరమాత్మ జ్ఞానానికీ హేతువునందు వైరుధ్యమున్నది.  అలాగే, కర్మ అనుష్ఠానాన్ని అపేక్షిస్తుంది.  పరమాత్మ జ్ఞానమునకు అట్టి అపేక్ష లేదు.  ఇది స్వరూప రీత్యా వైరుధ్యము.  కర్మకు ఫలము స్వర్గాదులు.  జ్ఞానానికి ఫలము నిత్యసిద్ధమైన ఆత్మ.  ఈ విధంగా, ఫలములయందు కూడా వైరుధ్యమే.) (కాబట్టి, పరమాత్మజ్ఞానము మరియు వేదవిహిత కర్మలు ఒకేసారి సంభవం కావు. అందుచేత, విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ’ మంత్రమునందు కూడా విద్య అనగా దేవతా విషయక ఉపాసనగానే గ్రహించాలి.)

సందేహం:

          విద్య, అవిద్యల మధ్య విరోధము లేదా అవిరోధములలో వికల్పము సంభవించిన ఎడల (అనగా ఒకచో విరోధత్వాన్ని మరొకచోట అవిరోధిత్వమును -  ఏదో ఒక దాన్ని తీసుకొనే అవకాశమున్నందున) వాటి సముచ్చయమునే (11వ మంత్రములో చెప్పబడిన) అవిరోధత్వము పరంగా గ్రహింపవచ్చు కదా.

సమాధానం:

          కాదు. వాటి (అనగా పరమాత్మజ్ఞానము మరియు వేదవిహిత కర్మలు) కలయిక అసంభవమని నిరూపించబడినది.  (అవి ఒకేసారి సంభవించే అవకాశము లేదని నిరూపితమైనది)

సందేహం:

          జ్ఞానము,  కర్మ ఒకదాని తరువాత ఒకటి క్రమంగా ఒకే వ్యక్తిలో సంభవించే అవకాశమున్నది కదా.

సమాధానం:

          జ్ఞానము కలుగగానే (అవిద్య తొలగిపోగానే), దాన్ని (ఆ జ్ఞానాన్ని) అవిద్య ఆశ్రయించి ఉండటం అవాస్తవం. ఉదాహరణకు, అగ్ని వేడిమిని, తేజస్సును కలిగి ఉన్నది అని ఒక వ్యక్తి తెలుసుకొన్న తర్వాత అతనిలో అగ్ని చల్లగా ఉంటుంది, ప్రకాశ రహితము అనే అజ్ఞానము గాని శంక గాని పొరబడటం గాని ఉండదు. యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః | తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః’ ఈ పై చెప్పిన 7వ మంత్రము ఆత్మజ్ఞానము కలిగిన వానికి శోకమోహాదులు అసంభవమని నిర్థారించినది కదా.  ఆవిధంగా అవిద్య అసంభవమైనందున దాని ఉపాదాన కారణమైన కర్మకూడా అసంభవమేనని ముందు మాచే చెప్పబడింది. అమృతమశ్నుతే’ మంత్రమునందు అమృత శబ్దము ఆపేక్షితమే.  విద్య శబ్దమునకు అర్థము పరమాత్మ జ్ఞానమని చెప్పినట్లైతే, హిరణ్మయేన తో మొదలయ్యే మంత్రాలలో చెప్పిన విధంగా అంత్యకాలంలో ద్వారాన్ని మార్గాన్ని యాచించుట అనే ప్రయత్నమే ఉండదు.  ఆవిధంగా, కర్మకు ఉపాసనతో మాత్రమే సముచ్చయము కాని, పరమాత్మజ్ఞానముతో కాదు. అందువలన, ఈ ఈశావాస్యోపనిషత్ మంత్రములకు అర్థాన్ని యథావిధంగా మాచే విశదీకరించి వ్యాఖ్య చేయబడింది (అభిప్రాయము చెప్పబడింది).

 

(ఈశావాస్యోపనిషత్తును శంకరుల భాష్యాన్ని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేసిన మీదట సాధకులకు స్పష్టమయ్యే విషయాలు.

1. ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేద సంహితయొక్క మంత్రభాగంలో ఉన్నందున, ఈ ఈశావాస్యోపనిత్తు మంత్రాలు కర్మకాండలో ఉపయోగించబడతాయనే పొరపాటు అభిప్రాయం కూడదు.  ఈ మంత్రాలు ఆత్మగురించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాయి.

2.   కర్మలు ఆత్మజ్ఞానానికి పూర్తిగా భిన్నం.  కర్మల ఫలితంగాగాని లేదా వాటి సహాయంతో గాని ఆత్మజ్ఞానం పొందటం అసంభవం.

3. ఇంద్రియాలద్వారా మనసుకు గోచరించే ఈ జగత్తు సర్వాన్నీ ఈశ్వరుడేననే భావంతో కప్పివేయాలి.  అంటే జగత్తును చూస్తే ఈశ్వరుడే గోచరించాలి.  అలా జగత్తు భావాన్నీ తద్వారా ఈషణాత్రయాన్ని త్యజించి సాధకుడు తనను తాను రక్షించుకోవాలి.  ఈశ్వరుడు కాక వేరే ఇతరమేదీ గోచరించని వానికిక సంపద గురించిన కోరికే ఉదయించదు.  ఇది సన్యాసమార్గం.

4.    అయితే, ఆత్మ జ్ఞానం లేని నరులు, జీవితకాలాన్ని వేదవిహిత కర్మలాచరిస్తూ గడపాలి తప్ప వేరే దారి లేదు.  ఆ విధానంలో కర్మబంధం ఏర్పడదు. ఇలా ఆత్మ భావాన్ని నశింపచేసుకొన్నవారు, దేహ త్యాగం చేసిన తర్వాత చీకట్లు అలముకొన్న ఆసురీ లోకాలవైపు పయనిస్తారు.

5.  ఇంద్రియాలు, మనసు వీటన్నింటినీ ఆత్మ అధిగమిస్తుంది. అది అలా ఉంటూనే అన్నింటినీ నియంత్రిస్తుంది.  ఆత్మ కదలుతుందీ కదలదు,  దూరంగా ఉంది  సమీపంగానూ ఉంది,  అన్నింటిలో ఉన్నదీ అన్నింటికి బాహ్యంగానూ అదే.  ఇలాటి వైరుధ్యాలన్నీ ఆత్మలో సమన్వయమైపోతాయి.  తనతో సహా ఈశ్వరత్వం తప్ప ఇతరమేదీ లేనందుచేత జుగుప్స, శోకం, మోహం ఉండే అవకాశమే లేదు. 

6.    సర్వత్రా వ్యాప్తమై ఉండటం, తేజోమయత్వం, స్థూల శరీర ధర్మాలేవీ లేకపోవడం, శుద్ధత్వం, పాపసంబంధం లేకపోవడం, సర్వజ్ఞత్వం, సకల బుద్ధివృత్తులను నియంత్రించే సాక్షి చైతన్యం, సర్వోత్కృష్టత్వం, స్వతంత్ర సత్తా కలిగిఉండటం. ఇవి ఆత్మను గురించిన విషయాలు.

7.   కేవలం వేదవిహిత కర్మలను మాత్రమే చేసేవారు చీకటిని ప్రవేశిస్తారు.  కేవలం ఉపాసనలను ఆచరించేవారు మరింత గాఢమైన చీకటిని ప్రవేశిస్తారు.  తెలివైనవారు వేదవిహిత కర్మలతో పాటుగా ఉపాసనలను కూడా ఆచరించి, కర్మల వల్ల (కామ్యకర్మ మృత్యువుతో సమానం కాబట్టి) అట్టి మృతత్వాన్ని అధిగమించి, ఉపాసనలవల్ల తాము ఉపాసించిన దేవతా స్వరూపాన్ని పొందుతారు.

8. ఉపాసనలలో అవ్యాకృతాన్ని (మూర్తిరూపంగా లేనిదాన్ని లేదా ప్రకృతిని) ఉపాసించినవాళ్ళు చీకటిని ప్రవేశిస్తారు.  మరైతే వ్యాకృతమైన (మూర్తిమంతమైన కార్యబ్రహ్మమును) ఉపాసించినవాళ్ళు మరింత గాఢమైన చీకటిని ప్రవేశిస్తారు.  అయితే, అవ్యాకృతంతో పాటుగా వ్యాకృతాన్ని కూడా ఉపాసించిన వాళ్ళు వ్యాకృతోపాసన వల్ల మృతత్వాన్ని అధిగమించి, అవ్యాకృతోపాసనవల్ల ప్రకృతి విలీనత్వమనే అమృతత్త్వాన్ని సాధిస్తారు.

9.  జీవిత చరమాంకంలో, తమకు అన్యమైన సత్యం వేరొకటి ఆదిత్యమండలంలోని పురుషుడుగా ఉన్నదనే భావన చేస్తూ, ఆ సత్యం ఆదిత్యుని తేజస్సువల్ల దాచి ఉంచబడినందున దానిని దర్శించేందుకై, తన తేజో కిరణాలు ఉపసంహరించి అనుగ్రహించమని సూర్యుణ్ణి ప్రార్థిస్తాడు.

10. మరింకా, తన జీవితంలోని సంకల్పాలకు ప్రతీకయైన మనసును జీవితకాలంలో తాను చేసిన కర్మలను స్మరించమని ఆర్తిగా కోరతాడు.  ఎందుకంటే,  ఆ కర్మల ఫలాలను అనుభవించాలనే తపన అతనిలో ఇంకా మిగిలే ఉంటుంది.

11. జీవితకాలంలో నేను చేసిన సర్వ కర్మలు, ఉపాసనలూ నీకెరుకే కాబట్టి, వాటి ఫలాలు పొందేలా నన్ను ఉత్తమమైన మార్గాన తీసుకెళ్ళు.  పుణ్యఫలాల అనుభవానికి ఆటంకాలయ్యే నే చేసిన పాపాలను దహించుఅంటూ అగ్నిని ప్రార్థిస్తాడు. 

12. ఆత్మనిష్ఠుడైన సాధకుడు పొందే ఫలానికీ, కర్మనిష్ఠుడైన సాధకుడు పొందే అనుభవానికీ గల తేడా స్పష్టంగా ఈశావాస్యోపనిషత్ పై విధంగా నిరూపణ చేస్తోంది.)

 

|| ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ ఈశావాస్యోపనిషద్భాష్యమ్ సంపూర్ణమ్ ||